కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి (Kamepalli) మండలంలో ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విస్తృతంగా పర్యటించారు. సుమారు 11.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు విద్యుత్, రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా తొలుత అడవి మద్దులపల్లి గ్రామంలో రూ.2.85 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రానికి ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం మండలంలో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రెండు కీలక రహదారి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.3.95 కోట్ల వ్యయంతో తాళ్లగూడెం నుంచి ఎం.పీ.పీ.ఎస్. పాఠశాల మీదుగా నర్సయ్యకుంట వరకు చేపట్టనున్న బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5 కోట్ల అంచనా వ్యయంతో ఇల్లందు ఆర్&బీ రోడ్డు నుంచి కామేపల్లి పెద్ద చెరువు మీదుగా కామేపల్లి శ్మశాన వాటిక వరకు నిర్మించనున్న బీటీ రహదారి పనులను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి (Bhatti Vikramarka) మాట్లాడుతూ.. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానికంగా విద్యుత్, రహదారి వంటి మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

