కలం, ఖమ్మం బ్యూరో: రైతులకు అండగా ఉండటంలో తమ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భరోసా ఇచ్చారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గార్లపాడు గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటూ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని సేకరించాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని మంత్రి స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా, కేంద్రం నుంచి ఎలాంటి సరైన స్పందన లేదని విమర్శించారు.
ప్రస్తుతం కళ్లాల్లో పర్యటిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు… కేంద్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యాన్ని సేకరించడం లేదో ఇక్కడి రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రాజకీయం చేయడం పక్కన పెట్టి, రాష్ట్రం కొనుగోలు చేసిన ప్రతి గింజను కేంద్రం తీసుకునేలా ఇక్కడి బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్నప్పటికీ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యానికి మించి ధాన్యాన్ని సేకరిస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని విధించగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రికార్డు స్థాయిలో 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందన్నారు. అలాగే రబీ 2025-26కు సంబంధించి కేంద్రం 51.60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని ఇస్తే, ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిందని చెప్పారు. ఈ రబీ సీజన్ చివరి నాటికి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

