కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ (US Iran) మధ్య ఒప్పందం దాదాపు కుదిరినట్లే. పలు అంశాలకు సంబంధించి ఇరు దేశాలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఫ్రేమ్ వర్క్ ఖరారైందని.. తుది ఆమోదం కోసం ట్రంప్ వద్దకు పంపించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు అంగీకరిస్తే.. పశ్చిమాసియాలో ఇక యుద్ధం అధికారికంగా ముగియనుంది. ఇరాన్ ఇక హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తే.. అంతర్జాతీయ చమురు రవాణా నిరాంటకంగా కొనసాగే అవకాశం ఉంది.
యురేనియంపైనే ప్రధాన చర్చ..
ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకోవద్దనేదే అమెరికా పెడుతున్న ప్రధాన షరతు. అణు బాంబ్ తయారీకి వాడే శుద్ధి చేసిన యురేనియాన్ని తమకు అప్పగించాలని అగ్ర రాజ్యం కోరుతోంది. తాజా చర్చల్లోనూ ఇదే ప్రధాన అంశంగా ఉంటూ వస్తోంది. ఎట్టకేలకు ఇరాన్ అంగీకరించి, యురేనియం అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో, టెహ్రాన్ భద్రతకు అవసరమైన హామీలను కూడా డిమాండ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడుల నుంచి స్పష్టమైన ఉపశమనం కోరుతోంది. ట్రంప్ ఆమోదించాక, దీనిలో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

