కలం, జగిత్యాల : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను భారత్ సురక్ష సమితి (Bharat Suraksha Samiti) రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తీవ్రంగా ఖండించారు. జగిత్యాలలోని (Jagtial) కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో భారత్ సురక్ష సమితి నాయకులు ఏసీఎస్ రాజు, జిల్లా అధ్యక్షుడు అక్కినపల్లి కాశీనాథం, సమరసత వేదిక కరీంనగర్ విభాగ్ సంయోజక్ చిట్ల గంగాధర్ మాట్లాడారు. ఆదివారం పాట్నాలో జరిగిన సమావేశంలో మోదీనే కాకుండా ఆయన తండ్రిని కూడా జైలుకు పంపిస్తామని ఖర్గే వ్యాఖ్యానించడం, ఆయన వయసుకు తగిన మాటలు కావని అన్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో వరుస ఓటములతో అసహనానికి గురై ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
భారతీయ సంస్కృతిలో పెద్దలను, మరణించిన వారిని గౌరవించడం సంప్రదాయమని పేర్కొన్నారు. 84 ఏళ్ల వయసులో పార్టీ అధ్యక్ష స్థానంలో ఉండి సహనం కోల్పోవడం సరికాదని విమర్శించారు. SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, వాటికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామనడం కాంగ్రెస్ అవివేకానికి నిదర్శనమన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 13 కోట్ల ఓట్ల తొలగింపు వివరాలు వెల్లడించినా, ఓటు కోల్పోయిన ఒక్క ఓటరునైనా చూపించే ధైర్యం కాంగ్రెస్కు లేదన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో అక్రమంగా దేశంలో స్థిరపడిన వారికి మద్దతుగా కాంగ్రెస్, ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. దేశభక్తులైన ప్రజలు ఈ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్యదర్శి సింగం గంగాధర్, 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, వేముల పోచమల్లు, ఎడమల వెంకట్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ వీరన్న, కొత్తకొండ గాదాసు భూమన్న, బాసెట్టి ప్రభాకర్, నరేందుల శ్రీనివాస్, సిరిపురం గంగారం, వేముల దేవరాజం, బాసెట్టి దుబ్బరాజం, బొందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

