కలం, అలంపూర్: పగటి పూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర నేరస్థుడిని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వడ్డే పీట్ల గంగాధర్ (31)పై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మొత్తం 43 కేసులు నమోదైనట్లు డీఎస్పీ మొగులయ్య వెల్లడించారు. సోమవారం శాంతినగర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మొగులయ్య ఈ నేరస్థుడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన గంగాధర్.. శాంతినగర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో అక్టోబర్ 14న చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, సోమవారం తెల్లవారుజామున అలంపూర్ చౌరస్తాలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 20 తులాల బంగారంలో 10 తులాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ శంకర్, ఎస్ఐ నాగశేఖర్రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

