కలం, స్పోర్ట్స్: రోహిత్ శర్మ (Rohit Sharma).. ఫిట్నెస్ ఉండని ప్లేయర్. లేజీగా ఉంటాడు. అసలు మైదానంలో పరిగెత్తగలడా. అసలు ఫిట్నెస్ అన్న పదానికి అర్థం కూడా తెలియని ప్లేయర్… ఇలా టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై అనేక మంది కామెంట్స్ చేశారు. ఇటీవల 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ స్థానం గురించి జరిగిన చర్చల్లో కూడా ఫిట్నెస్ అనేది ప్రధానంగా మారింది. ఇప్పటికి కూడా చాలా మంది రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ విమర్శలన్నింటికీ భారత మాజీ ఫిట్నెస్ కోచ్ సోహమ్ దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రోహిత్ ఫిట్నెస్ గురించి మాట్లాడేముందు.. అతడి కెరీర్‌ను ప్రమాదంలో పడేసిన పాత గాయం గురించి తెలుసుకోవాలన్నాడు సోహమ్. 2017లో రోహిత్‌కు తీవ్రమైన హిప్ గాయం అయిందని వెల్లడించాడు. ఆ గాయం నుంచి కోలుకుంటూనే ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడని వివరించాడు.
రోహిత్‌ను బద్ధకస్తుడిగా చూడటం సరికాదని సోహమ్ అభిప్రాయపడ్డాడు. అతడి హిప్ భాగం ఇప్పటికీ బలహీనమైన ప్రాంతమని తెలిపాడు. హ్యామ్‌స్ట్రింగ్, హిప్ ఫ్లెక్సర్ సమస్యలతో రోహిత్‌కు శస్త్రచికిత్సలు కూడా జరిగాయని వెల్లడించాడు. ఈ గాయం కారణంగా రోహిత్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోందని సోహమ్ వివరించాడు. వారానికి కనీసం రెండు స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్లు చేయడం తప్పనిసరని తెలిపాడు. వీటితో పాటు క్రమం తప్పకుండా రన్నింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలని సూచించాడు.
విరాట్ కోహ్లీతో పోలిస్తే రోహిత్ శిక్షణ విధానం భిన్నంగా ఉంటుందని సోహమ్ పేర్కొన్నాడు. రోహిత్‌కు గత గాయాల కారణంగా స్ట్రెంత్ ట్రైనింగ్‌తో పాటు వేగంగా కదిలే సామర్థ్యాన్ని పెంచే వ్యాయామాలు అవసరమని వివరించాడు. 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం అతడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ను కొనసాగించడం కీలకం కానుంది.

