పట్టభద్రుల షాకింగ్ ట్విస్ట్.. ఎమ్మెల్సీ ఓటర్ల దరఖాస్తులు సగమే!

కలం, తెలంగాణ బ్యూరో: రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (Graduates MLC) స్థానాల కోసం ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని పార్టీలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం గణాంకాలు సైతం ఇదే వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంతో పాటు నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల స్థానానికి కలిపి సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ అయింది. అప్పటి నుంచి పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ మొదలైంది.

నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం ఉన్నది. ఇప్పటివరకు ఈ రెండు జిల్లాలకు కలిపి మొత్తం 5,23,758 దరఖాస్తులు రాగా.. ఇందులో 26,085 అప్లికేషన్లకు ఆమోదం లభించింది. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లలో కటాఫ్ తేదీల వ్యత్యాసం ఉందన్న కారణంతో మరో 1,581 అప్లికేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఇంకో 4,96,112 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.

గత ఎన్నికల సందర్భంగా (2021లో) ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో 10.37 లక్షల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా, దాదాపు అందులో సగం మాత్రమే ఈసారి దరఖాస్తు చేసుకున్నారు. మరో పన్నెండు రోజులు అవకాశం ఉన్నందున అన్ని పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు మొదలు ఎమ్మెల్యేల వరకు ఎంతమందిని చేర్పిస్తారన్నది కీలకంగా మారింది.

సర్టిఫికెట్లలో లోపాలు

ఇప్పటివరకు ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేసిన 1,581 దరఖాస్తుల్లో ఎక్కువగా బోగస్ సర్టిఫికెట్లు, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన యూనివర్సిటీలు లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. దీనికి తోడు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 2023 అక్టోబర్ 31 కటాఫ్ తేదీగా గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత ఉండాలనడంతో అలాంటి విద్యార్హతల గుర్తింపు సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు అక్టోబర్ 31, 2023 కటాఫ్ తేదీ తర్వాత వచ్చిన ఫలితాలు విడుదల కావడంతో ఆ గ్రాడ్యుయేషన్‌ను గుర్తించకపోవడం మరో కారణం. సర్టిఫికెట్లు ఆలస్యంగా చేతికందినా పరీక్షల ఫలితాలు మాత్రం అక్టోబర్ 31, 2023 నాటికే వెలువడ్డాయనే ఆధారాలు చూపితే అలాంటి దరఖాస్తులను అర్హమైనవాటిగానే గుర్తిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రక్రియలో రెండు నియోజకవర్గాల వ్యాప్తంగా దరఖాస్తుల సంఖ్య మరియు వాటి పరిశీలన వేగంలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,29,937 దరఖాస్తులు రాగా, వీటిలో ఇప్పటివరకు కేవలం 4,695 అప్లికేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 129 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా, అత్యధికంగా 2,25,133 దరఖాస్తులు ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయి.

మరోవైపు వరంగల్ – ఖమ్మం – నల్గొండ నియోజకవర్గం నుండి మొత్తం 2,93,821 దరఖాస్తులు నమోదు కాగా, అక్కడ ఆమోద ప్రక్రియ కొంత వేగంగా సాగి 21,390 అప్లికేషన్లకు ఆమోదం లభించింది. అయితే సర్టిఫికెట్లలో లోపాల వల్ల ఇక్కడ 1,452 దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, మిగిలిన 2,70,979 దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే రెండు నియోజకవర్గాల్లోనూ వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఇప్పటివరకు ఆమోదించినవి చాలా స్వల్పంగా ఉండగా, మెజారిటీ దరఖాస్తులు పరిశీలనలోనే వేచి ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>