కలం, ఖమ్మం బ్యూరో: బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడటంలో, నిందితులకు సరైన శిక్ష పడేలా చేయడంలోనూ కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర అత్యంత కీలకమని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీ అధికారులకు ఆయా కేసుల పట్ల పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్టేషన్‌హౌస్ ఆఫీసర్లదేనని పేర్కొన్నారు.
సమన్లు, వారెంట్ల జారీలో జాప్యం ఉండొద్దు
బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా ప్రతి కేసును సమగ్రంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమన్లు, వారెంట్ల జారీలో ఎలాంటి జాప్యం జరగకూడదని, వాటిని సకాలంలో సాక్షులకు, నిందితులకు అందజేయాలని సూచించారు. ముఖ్యంగా కోర్టులో విచారణ నడిచే సమయంలో సాక్షులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూసుకోవాలని, వారికి కేసు వివరాల పట్ల ముందస్తుగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
సీజ్ చేసిన ప్రాపర్టీని కోర్టుకు సరెండర్ చేయాలి
కేసులకు సంబంధించి సీజ్ చేసిన ప్రాపర్టీని ఎప్పటికప్పుడు కోర్టుకు సరెండర్ చేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ పైఅధికారులకు తెలియజేస్తూ సిబ్బంది అంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యాయాధికారులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, నేరస్తులకు శిక్ష పడే విధంగా కేసుల పరిష్కారంలో కృషి చేసి, బాధితులకు న్యాయం చేకూర్చడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని ఎస్పీ గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

