కలం, ఖమ్మం బ్యూరో : విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు వార్డెన్లపై జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) కఠిన చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లందు(Yellandu) పట్టణంలో మంగళవారం నిర్వహించిన పర్యటనలో భాగంగా పలు వసతి గృహాలను తనిఖీ చేసిన కలెక్టర్, లోపాలు బయటపడడంతో వెంటనే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు.
ముందుగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సదుపాయాలు, భోజన నాణ్యత, బోధన పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భోజనం సమయానికి సంబంధించి సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం, మెనూ పాటించకపోవడం, పరిశుభ్రత లోపాలు గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అసహనీయమని పేర్కొంటూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ భరత్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు.
తదుపరి, ఇల్లందులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసినప్పుడు వార్డెన్ సిబ్బంది అక్కడ లేకపోవడం గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వసతి గృహ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం బయటపడడంతో సంబంధిత వార్డెన్‌పై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో నిర్ణీత సమయానికి భోజనం సిద్ధంగా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది విధుల్లో లోపాలు గమనించి వార్డెన్‌ను హెచ్చరించారు. విద్యార్థులకు సమయానికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడం బాధ్యతగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్ఎంఓ రామ్ నివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

