కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసు( Moinabad Drugs Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో అరెస్టైన ముగ్గురు నిందితులకు భారీ షాక్ తగిలింది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డి, నమిత్ శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రాజేంద్రనగర్ కోర్టు కొట్టివేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున.. ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా, గత నెల 14న రాత్రి మెయిన్ బాద్ లోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని ఈగల్ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ సేవిస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో రితిష్ రెడ్డి కి చెందిన లైసెన్స్ రివాల్వర్ను నమిత్ శర్మ తీసుకుని పోలీసులను భయపెట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు. అనంతరం రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డి, నమిత్ శర్మ లతో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం పరిణామాల్లో భాగంగా పుట్టా మహేశ్ యాదవ్ కు బెయిల్ ఇచ్చారు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలు కు తరలించారు. ప్రస్తుతం వారిని కస్టడీలోకి తీసుకుని డ్రగ్స్ కేసులో ముఖ్యమైన విషయాలను రాబట్టే పనిలో అధికారులు ఉన్నారు.

