ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ లోపాలు.. అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలపై జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి. జూలూరుపాడు మండలంలో జరిగిన ఈ తనిఖీల్లో పరిస్థితులపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం(KGBV), జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీట్‌రూట్ వంటి పోషకాహార కూరగాయలు ఇవ్వకపోవడం, నాణ్యత లేని భోజనం అందించడం వంటి అంశాలపై సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు తప్పనిసరిగా తాజా, నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

విద్యార్థులు చేతులు కడుక్కునే ప్రదేశంలో ట్యాపులు పనిచేయకపోవడం, ఆర్.ఓ ప్లాంట్ పనిచేయకుండా ఉండడం వంటి అంశాలపై కూడా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేయగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేశారో వివరణ కోరుతూ.. ఒక వారంలో ఆర్.ఓ ప్లాంట్‌ను సరిచేయాలని ఆదేశించారు. అనంతరం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన, స్టోర్ రూమ్‌లో కుళ్లిన కూరగాయలు నిల్వ ఉంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసన వస్తున్న కూరగాయలను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అంకిత్ (Collector Ankit) అధికారులను ఆదేశించారు.

పాఠశాలలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడంపై కలెక్టర్ స్పందిస్తూ, అవి అలంకారం కోసం కాదని, వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పోషకాహారం, శుభ్రమైన త్రాగునీరు, పరిశుభ్ర వాతావరణం కల్పించడం అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. అనవసర ఖర్చులను తగ్గించి విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాల అభివృద్ధికి నిధులను వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో తహసిల్దార్ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: కవిత క్షమాపణలన్నీ ఓట్ల కోసమేనా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>