కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఒకే రోజు అత్యంత అరుదైన, ప్రశంసనీయ ఘట్టం చోటుచేసుకుంది. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (Cherla CHC)లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమిష్టి కృషితో శనివారం ఒక్కరోజే ఏకంగా 8 సురక్షిత ప్రసవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఒకే రోజు ఎనిమిది ప్రసవాలు నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను సురక్షితంగా కాపాడటంతో ఈ శనివారం కాస్తా ‘వండర్ శనివారం’గా నిలిచింది.
చర్లతో పాటు ఏజెన్సీ పరిసర గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులను చేర్చుకుని, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రతి కేస్నూ అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా ప్రసవాలు నిర్వహించారు. పురిటినొప్పులతో వచ్చిన గర్భిణులకు మెరుగైన సేవలు అందించి, కాన్పులు సురక్షితంగా జరగడంతో ప్రస్తుతం తల్లులు, నవజాత శిశువులు క్షేమంగా ఉన్నారు.
మారుమూల, భౌగోళిక సవాళ్లు ఉన్న ప్రాంతాల్లోనూ పేద గిరిజనులకు ఎలాంటి లోటు రాకుండా కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్సీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమ బిడ్డలకు సురక్షితంగా జన్మనిచ్చిన వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి బాలింతల కుటుంబ సభ్యులు, స్థానికులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

