కలం, స్పోర్ట్స్: క్రికెట్‌ను కుదిపేసిన 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ స్టువర్ట్ మెక్‌గిల్ (Stuart MacGill) శాండ్ పేపర్‌తో బంతిని గీసినట్లు అంగీకరించాడు. బంతి పరిస్థితిని మార్చేందుకు ఈ పని చేసినట్లు వెల్లడించాడు. ఓ యూ ట్యూబ్ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడిన మెక్‌గిల్.. తన బొటనవేలికి చిన్న శాండ్ పేపర్ ముక్కను టేప్‌తో అతికించుకునేవాడినని చెప్పాడు. టీ విరామం తర్వాత బంతిని తీసుకుని దాంతో గీసేవాడినని, ఆ తర్వాత శాండ్ పేపర్‌ను పడేసేవాడినని వివరించాడు. ఇది పెద్ద కుట్రలో భాగం కాదని, ప్రయోగం చేయాలనే ఆసక్తితోనే అలా చేశానని తెలిపాడు.
అందరికీ తెలుసంటూ..
ఇటీవల ఉస్మాన్ ఖవాజా తన పుస్తకం ‘సబ్ర్’లో 2018 కేప్‌టౌన్ టెస్టు బాల్ ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారం గురించి జట్టులోని అందరికీ తెలుసని పేర్కొన్నాడు. అప్పట్లో ఈ ఘటనలో శిక్షకు గురైన డేవిడ్ వార్నర్ కూడా ఖవాజా వ్యాఖ్యలకు మద్దతు తెలిపాడు. అయితే, జట్టులోని అందరికీ శాండ్ పేపర్ వాడే ప్రణాళిక తెలియదని క్రికెట్ ఆస్ట్రేలియా చెబుతోంది. అప్పటి కోచ్ డారెన్ లెమన్, మిచెల్ స్టార్క్ సహా పలువురు ఆటగాళ్లు తమకు ఈ విషయం తెలియదని స్పష్టం చేశారు. మెక్‌గిల్ తాజా అంగీకారంతో ఈ పాత వివాదం మరోసారి చర్చకు వచ్చింది.

