కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని (Chakali Ilamma Statue) ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampalli Satyanarayana) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కామారెడ్డి భాస్కర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, టెంపుల్ చైర్మన్ కోలపురి అనంతగిరి, అంతగిరి వినయ్ కుమార్, తీగల భాగ్యలక్ష్మి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

