కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక వసతుల అభివృద్ధితో పల్లెలకు కొత్త శోభ తీసుకురావడంతో పాటు స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్‌లతో కలిసి ఆదివారం సుమారు రూ. 21.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
చింతకాని మండల కేంద్రంలోని చెరువు వద్ద రూ. 7.90 కోట్లతో పర్యాటక వసతుల కల్పన పనులతో పాటు, రూ. 13.68 కోట్లతో పందిళ్లపల్లి-అనంతసాగర్ బీటీ రోడ్డు, జగన్నాథపురం వద్ద పంచాయతీరాజ్ బీటీ రోడ్డు, నాగులవంచ ఆర్‌అండ్‌బీ అండర్‌పాస్ రోడ్డు, నరసింహాపురం ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను భట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వల్ల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించడమే కాకుండా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గత 34 నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని, ఈ పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మార్కెట్‌లో కిలో రూ. 60 పైగా ఉన్న సన్న బియ్యాన్ని రాష్ట్రంలో కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచితంగా అందిస్తున్నామని భట్టి తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏటా రూ. 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందిరమ్మ ఇండ్ల నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

