కలం, ఖమ్మం బ్యూరో: వర్షాకాలం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపై ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సమీక్ష చేశారు. మంగళవారం భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి పూనెం కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు. పట్టణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకవర్గం చొరవ చూపాలని కోరారు.
సర్పంచి, వార్డు సభ్యులు పంచాయతీ కార్యనిర్వహణాధికారి (ఈవో) సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డు మెంబర్ తమ పరిధిలోని తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా పంచాయతీ యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండాలని పంచాయతీ ఈవో శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు. ఉప సర్పంచి రత్నం కవిత, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: మత్స్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవోగా వెంకటయ్య
Follow Us On: X(Twitter)

