కలం, సూర్యాపేట: పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు రుజువు కావడంతో జిల్లా పరిషత్ (జడ్పీ) కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్.కె. మెయినోద్దీన్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను సస్పెండ్ (Suspended) చేస్తూ సూర్యాపేట (Suryapet) కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మెయినోద్దీన్ గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. ఆ సమయంలో తన పరిధిలోని పలువురు పంచాయతీ కార్యదర్శులను భయభ్రాంతులకు గురిచేస్తూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. బాధితుల ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఉన్నతాధికారులు జరిపిన ఎంక్వైరీలో మెయినోద్దీన్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. విచారణాధికారులు సమర్పించిన తుది నివేదిక ఆధారంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ (Suryapet Collector) ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించినా.. అవినీతి అక్రమాలకు పాల్పడినా సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనాసరే లంచాలకు మరిగితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, మెయినోద్దీన్ సస్పెన్షన్ వేటు ఇతర అవినీతిపరులకు ఒక హెచ్చరిక అని అధికారులు పేర్కొన్నారు.
Read Also: నిరుద్యోగులపై లాఠీచార్జ్ అత్యంత హేయమైన చర్య: కేటీఆర్
Follow Us On: X(Twitter)

