కలం వెబ్ డెస్క్ : డబ్బు సేవ్ చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అందులో సీనియర్ సిటిజన్లు(Senior Citizens) కూడా ఉంటారు. తాము ఒకరికి భారం కాకుండా, ఒకరిపై ఆధారపడకుండా ఉండటం కోసం వారు కాస్త డబ్బు సేవ్ చేయాలని ఆలోచిస్తారు. కానీ ఎక్కడ? ఎలా సేవ్ చేయాలో తెలీదు. ఇందు కోసం ఎక్కువ మంది ఫిక్స్‌డ్ డిపాజిట్(Fixed Deposits)లను ఎన్నుకుంటారు. అందులోనూ తమకు ఏది బెస్ట్ అనేది తెలియదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల వరుసగా రెపో రేట్లు తగ్గించడంతో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అయినా సీనియర్ సిటిజన్లకు ఇప్పటికీ మంచి ఊరట లభిస్తోంది. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై గరిష్టంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తున్నాయి. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయం కోసం చూస్తున్న వారికి ఇవి ఆకర్షణీయంగా మారుతున్నాయి.
బ్యాంక్ వారీగా సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
పైసాబజార్ డాట్ కామ్ గణాంకాల ప్రకారం జనవరి 2, 2026 నాటికి ఐదేళ్ల ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు బ్యాంకులవారీగా భిన్నంగా ఉన్నాయి.
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీ ఇస్తోంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వడ్డీ అందిస్తోంది.
ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వడ్డీ ఇస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.77 శాతం వడ్డీ అందిస్తోంది.
శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 6.75 శాతం వడ్డీ ఇస్తోంది.
స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం వడ్డీ ఇస్తోంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.7 శాతం వడ్డీ అందిస్తోంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ రేట్లు జనవరి 2 2026 నాటికి పైసాబజార్ డాట్ కామ్ గణాంకాల ఆధారంగా ఉన్నాయి.
పన్నుల మినహాయింపు కూడా
పన్నుల విషయంలోనూ సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరట లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమల్లో ఉన్న కొత్త పన్ను విధానం ప్రకారం మొత్తం ఆదాయం రూ.11 లక్షల వరకు ఉంటే సెక్షన్ 87ఏ రిబేట్ కారణంగా చివరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ రిబేట్ ప్రస్తుతం రూ.12 లక్షల ఆదాయం వరకు వర్తిస్తుంది. ఫలితంగా ఎఫ్‌డీలపై వడ్డీ ఆదాయం వచ్చినా చాలామంది సీనియర్ సిటిజన్లు వాస్తవంగా పన్ను పరిధికి దిగువన ఉంటారు.
అయితే బ్యాంకులకు ప్రతి డిపాజిటర్ తుది పన్ను స్థితి తెలియదు. అందువల్ల వడ్డీ ఆదాయం రూ.1 లక్ష దాటిన వెంటనే బ్యాంకులు టీడీఎస్ కట్ చేస్తాయి. మొత్తం ఆదాయం కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల లోపు పాత పన్ను విధానంలో రూ.5 లక్షల లోపు ఉంటే సీనియర్ సిటిజన్లు ఫారమ్ 15హెచ్ సమర్పించడం ద్వారా టీడీఎస్ కట్ కాకుండా చేసుకోవచ్చు. ఆర్థిక నిపుణులు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లతో పాటు బ్యాంక్ భద్రత పన్ను నిబంధనలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు.


