కలం డెస్క్ : మంత్రులు, అదికారులు చెప్పేది ఒకటైతే, క్షేత్రస్థాయిలో జరిగేది మరొకటని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారుల మాటలు అక్కడివరకే పరిమితమని, ఆచరణలో మాత్రం సిబ్బంది పట్టించుకున్న దాఖలాలే లేవని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతే విద్యుత్ శాఖ సిబ్బంది పట్టించుకోవడంలేదని, రైతులే తలా కొంచెం చందాలు వేసుకుని సొంతంగా రిపేర్లు చేయించుకుంటున్నారని అన్నారు. శాసనమండలిలో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, నల్లగొండ జిల్లాకు చెందిన తాను దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నానని, మండలి ఛైర్మన్ సహా చాలా మందికి ఈ విషయం తెలుసన్నారు. ప్రభుత్వమే ట్రాన్స్ ఫార్మర్లకు రిపేర్లు చేయిస్తున్నదంటూ డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదన్నారు.
గతంలో ఒక్కో డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్)కు రెండు చొప్పున కరెంటు స్థంభాలు మంజూరయ్యేవని, ఇప్పుడు ఒక్కటి మాత్రమే వస్తున్నదని Nellikanti Satyam ఫైర్ అయ్యారు. రైతులే సొంతంగా డబ్బు పెట్టుకుని స్థంభాలను కొనుక్కుంటున్నారని అన్నారు. మంత్రులు చెప్పేది అధికారులు పాటించడంలేదా?.. లేక సీరియస్‌గా తీసుకోవడంలేదా?.. ఈ విషయాలను డిప్యూటీ సీఎం పరిశీలించాలని సూచించారు. దీనిపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ “చాలా సందర్భాల్లో నేనే నల్లగొండ విద్యుత్ ఎస్ఈకి ఫోన్ చేసి చెప్పాను. కానీ చర్యలు తీసుకోలేదు. విద్యుత్ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పినట్లుగా గ్రామ స్థాయిలో అలాంటి పరిస్థితి లేదు” అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లికంటి సత్యం మాట్లాడుతున్న సందర్భంగా వాస్తవ పరిస్థితిపై అదే జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ఈ విషయాలు తెలుసని, ఆయన అభిప్రాయాన్ని కూడా సభకు వివరిస్తే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి డిప్యూటీ సీఎంకు తెలుస్తుందని అనడంతో చైర్మన్ పై విధంగా స్పందించారు.


