కలం, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru)లో బుధవారం సాయంత్రం కురిసిన వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. మండు వేసవిలో పిడుగులు, మెరుపులతో కురిసిన వర్షంతో గోడ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కళ్యాణ్ నగర్, బనసవాడి, ఆర్టీ నగర్, ఎంజీ రోడ్, శివాజీనగర్, కబ్బన్ పార్క్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఈదురుగాలులకు జన జీవనం అతలాకుతలమైంది. శివాజీ నగర్ ప్రాంతంలోని బౌరింగ్ ఆస్పత్రిలో ఈదురుగాలులకు ప్రహరీ గోడ కూలి ముగ్గురు చిన్న పిల్లలు సహా ఏడుగురు మృతి చెందారు. మృతులంతా వీధి వ్యాపారం చేసుకునే వారేనని సమాచారం. వేసవి సెలవులు కావడంతో చిన్న పిల్లలు సైతం పెద్ద వాళ్లతో ఉండటంతో ఈ దారుణం జరిగింది.
ఇక ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం సిద్ధ రామయ్య ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలో భారీ వర్షానికి 50కి పైగా చెట్లు కూలిపోగా, రోడ్లన్నీ జలమయమయ్యాయి. డిప్యూటీ సీఎం శివ కుమార్ సైతం ఆయన కార్యక్రమాలు రద్దు చేసుకొని నగరానికి చేరుకున్నారు. అలాగే బెంగళూరులో ఫేమస్ బుక్ స్టోర్ బుక్‌వోర్మ్ వర్షానికి నీట మునిగింది. ఇందులో ఉన్న సుమారు 5 వేల పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి.

