కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఓదెల (Odela) మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై తేనెటీగల గుంపు విరుచుకుపడటంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర కలకలం రేగింది. ఈ దాడిలో ఆరు నెలల పసికందుతో సహా దాదాపు 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం నాడు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్వామివారి దర్శనం కోసం కరీంనగర్ నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో పాటు, అక్కడ ఉన్న ఇతర భక్తులపై తేనెటీగలు అకస్మాత్తుగా దాడికి దిగాయి. వందలాది తేనెటీగలు ఒకేసారి ముంచెత్తడంతో ఆలయ పరిసరాలు క్షణాల్లోనే భయానకంగా మారాయి. తేనెటీగల దాడి నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి భక్తులు పరుగులు తీశారు. భక్తుల అరుపులు, కేకలతో ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారింది. ఈ ప్రమాదంలో ఆరు నెలల పసికందుపై కూడా తేనెటీగలు దాడి చేయడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.
మొత్తంగా ఈ ఘటనలో 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అసలు తేనెటీగలు ఎందుకు రేగాయి అనే కోణంలో ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆలయ పరిసరాల్లో తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, తేనెతుట్టెలను తొలగించాలని భక్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

