కలం, వెబ్ డెస్క్ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ రోజు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు కఠిన నిబంధనలు విధించారు.
మరోవైపు, తెలంగాణలోనూ నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు (Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

