కలం, కరీంనగర్ బ్యూరో : సింగరేణి (Singareni) బొగ్గు గనుల్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్ఆర్పీ (SRP) – 3 (Srirampur Mine) భూగర్భ గనిలో గురువారం షిఫ్ట్ మైనింగ్ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. గని లోపల బొగ్గు వెలికితీత పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉండగా హఠాత్తుగా ‘సైడ్ వాల్’ (పక్క గోడ) కూలి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మహేందర్ అనే కార్మికుడికి తీవ్ర రక్తస్రావమై, పరిస్థితి విషమంగా మారడంతో సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఇద్దరు కార్మికులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మైనింగ్ ఏరియాలో ఒక్కసారిగా ఆందోళన, భయాందోళనలు నెలకొన్నాయి.
గతంలో ఇదే గనిలో ఘోర ప్రమాదం
శ్రీరాంపూర్ SRP-3 గనికి ప్రమాదాల చరిత్ర ఉంది. గతంలో నవంబర్ 2021లో ఇదే SRP-3 అండ్ 3A ఇన్‌క్లైన్ గనిలో అత్యంత ఘోరమైన ప్రమాదం జరిగింది. అప్పట్లో గని లోపల రూఫ్ స్టిచ్చింగ్ (పైకప్పు భద్రత) పనులు చేస్తుండగా దాదాపు 30 అడుగుల పైకప్పు ఒక్కసారిగా కూలిపడింది. ఆ ప్రమాదంలో నలుగురు కార్మికులు బి. లక్ష్మయ్య, వి. కృష్ణారెడ్డి, జి. సత్యనరసింహారాజు, ఆర్. చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆ సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. మళ్లీ ఇప్పుడు అదే గనిలో సైడ్ వాల్ కూలి ప్రమాదం జరగడం సింగరేణి యాజమాన్య భద్రతా తీరును ఎత్తి చూపుతోంది.
టార్గెట్లతో ఒత్తిడి
సింగరేణి వ్యాప్తంగా ఏటా జరుగుతున్న ప్రమాదాలు కార్మిక కుటుంబాల్లో నిరంతర భయాన్ని నింపుతున్నాయి. భూగర్భ గనుల్లో బ్లాస్టింగ్ జరిగిన తర్వాత పైకప్పు బలహీనపడుతుంది. కాకతీయ ఖని (KTK), వకిల్‌పల్లి గనుల్లోనూ గతంలో ఇలాంటి రూఫ్ కొలాప్స్ ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీరాంపూర్ పరిధిలోని RK-5B గనిలో గతంలో డెటొనేటర్లు సరిగ్గా పేలకపోవడం (Misfire) వల్ల జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని మైన్లలోనూ ఇలాంటి పేలుళ్లు జరిగాయి. సింగరేణి యాజమాన్యం నిర్దేశిత బొగ్గు టార్గెట్లను చేరుకోవడానికి కార్మికులపై ఒత్తిడి తెస్తుందని, రక్షణ చర్యలు పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే పనుల్లోకి పంపుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కార్మికుల భద్రతపై క్షేత్రస్థాయిలో వాస్తవాలు
సింగరేణి యాజమాన్యం కార్మికుల భద్రత కోసం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని, అత్యాధునిక రక్షణ పరికరాలు వాడుతున్నామని చెబుతోంది. కానీ, యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు వేరేలా ఉన్నాయంటున్నారు. గని పైకప్పు కూలకుండా ఉండటానికి ఐరన్ నెట్స్, రూఫ్ బోల్టింగ్ సాంకేతికతను వాడుతున్నారు. గని లోపల ప్రమాదకర వాయువులను గుర్తించేందుకు సెన్సార్లు ఏర్పాటు చేయడం, అంతర్గత రక్షణ కమిటీలతో గనుల తనిఖీ చేస్తున్నారా లేదా? పరిశీలించడం లేదు. అధికారులు ప్రొడక్షన్ టార్గెట్లపై పెడుతున్న శ్రద్ధ రక్షణ చర్యలపై పెట్టడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.
బ్లాస్టింగ్ జరిగిన తర్వాత మైనింగ్ ఇంజనీర్లు గనిని పూర్తిగా పరిశీలించి, అది క్లియర్ గా ఉందని నిర్ధారించిన తర్వాతే కార్మికులను పంపాలనే నిబంధనలు ఉన్నా.. చాలా చోట్ల వాటిని బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం SRP-3 లో జరిగిన ప్రమాదంపై సింగరేణి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. గాయపడిన మహేందర్ ప్రాణాలు దక్కాలని, క్షతగాత్రులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని కార్మికులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో వేర్వేరు సమయాల్లో కొన్ని ప్రమాదాలు జరిగాయి. వీటిలో SRP-3 ఇంక్లైన్ గని ప్రమాదం అత్యంత భారీ విషాదం నింపింది.
SRP-3 భూగర్భ గని ప్రమాదం
అలాగే ఇటీవల జరిగిన ఇతర ఘటనల వివరాలు చూస్తే.. ఇలా ఉన్నాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని SRP 3 బాయిలో జరిగిన రూఫ్ కొలాప్స్ (గని పైకప్పు కూలడం) ప్రమాదం సింగరేణి చరిత్రలో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. మొదటి షిఫ్ట్‌లో కార్మికులు బొగ్గు వెలికితీత పనులు పూర్తి చేసి, బ్లాస్టింగ్ జరిగిన తర్వాత గని పైకప్పును పటిష్టం చేసేందుకు (సపోర్ట్ బెడ్స్ వేస్తుండగా) ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 30 అడుగుల మేర గని పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో నలుగురు సింగరేణి కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒంటెల కృష్ణా రెడ్డి (59) – టింబర్మ్యాన్, బేర లక్ష్మయ్య (60) – టింబర్మ్యాన్ (రిటైర్ అయ్యాక ఏడాది సర్వీస్ పొడిగింపుపై డ్యూటీలో చేరారు), రెండ చంద్రశేఖర్ (32) – కేటగిరీ-1 కార్మికుడు (కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరారు). గడ్డం సత్యనర్సింహారాజు (32) – కేటగిరీ-1 కార్మికుడు.
RK-5 భూగర్భ గని ప్రమాదం (ఇటీవలి ఘటన), శ్రీరాంపూర్ ఏరియాలోని RK-5 (రామకృష్ణాపూర్) అండర్‌గ్రౌండ్ మైన్‌లో కూడా ఒక ప్రమాదం జరిగింది. సీమ్ 3 లో బొగ్గు లోడింగ్ చేసే సమయంలో రెండు టబ్బుల (బొగ్గు రవాణా చేసే పెట్టెలు) మధ్య ఒక కార్మికుడు ఇరుక్కుపోయాడు. జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జగన్ అనే కార్మికుడికి ఈ ప్రమాదంలో పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
RK-5B గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం.. గతంలో శ్రీరాంపూర్ RK-5B గనిలో ఉరుముల్లాంటి బ్లాస్టింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో డెటొనేటర్ మిస్‌ఫైర్ అయింది. ఈ పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. భూగర్భ గనుల్లో రక్షణ గోడలు, పైకప్పుల పటిష్టతపై సింగరేణి కార్మికులు నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. యాజమాన్యం తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీనిపై విచారణ జరిపిన సింగరేణి యాజమాన్యం మృతుల కుటుంబాలకు ఉద్యోగంతో పాటు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

