కలం, వెబ్ డెస్క్ : హిందువుల అత్యంత పవిత్ర పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ వార్షిక యాత్ర (Amarnath Yatra) గురువారం ప్రారంభమైంది. అమర్‌నాథ్ పవిత్ర గుహ వైపు వెళ్లే ఈ యాత్ర 57 రోజుల పాటు కొనసాగనుంది. అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా జూలై 3న(నేడు) ప్రారంభమై ఆగస్ట్ 28న ముగియనుంది. దీంతో నేడు హిమాలయాల్లో సహజసిద్ధంగా ఏర్పడే పవిత్ర హిమలింగం దర్శనం కోసం భక్తుల కాలినడక యాత్ర ప్రారంభం కానుంది.
కాగా, ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర కోసం ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మందికిపైగా భక్తులు నమోదు చేసుకున్నారు. అర్హులైన వారి కోసం జమ్మూలో తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించారు. దీంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. భక్తుల సంరక్షణ కోసం కశ్మీర్ అంతటా సెక్యూరిటీ పెంచారు. కఠినమైన ట్రాఫిక్ నియంత్రణలతో పాటు పటిష్టమైన నిఘాతో భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు ప్రధాన మార్గాల్లో వైద్య శిబిరాలు, భద్రతా బలగాలు, అత్యవసర సేవలు, విశ్రాంతి కేంద్రాలను సిద్ధం చేశారు.

