Mobile Popup Ad
Mobile Popup Ad

నా కొడుకు నిప్పు… నిందలు వేసినవాళ్ళను వదిలిపెట్టను: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) కుమారుడు బండి భగీరథ్‌ వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మైనర్ బాలికపై వేధింపుల కేసులో తన కొడుకు భగిరథ్ పై నమోదైన పోక్స్ కేసుపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి స్పందించారు. ఈ మేరకు కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రలో భాగంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్ చెప్పిన బండి సంజయ్.. హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నానని తెలిపారు. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. హిందూ సమాజానికి ఆపదొస్తే జై శ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతామని పేర్కొన్నారు. కరీంనగర్ గడ్డ రక్తం తనలో ప్రవహిస్తుందని .. కరీంనగర్ లో గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడిన అని గుర్తు చేశారు. తన జీవితం కష్టాలు, బాధలే అన్నారు. అయిన బాధలను చూసి భయపడి పారిపోయేటోడ్ని కాదని పేర్కొన్నారు. ఏ హిందువుకు ఆపదొచ్చినా అండగా ఉన్నానని.. వారి ఇంట్లో పెద్ద కొడుకునైన తాను టైమంతా సమాజానికే ఇచ్చానని వివరించారు.

తన కొడుకుకు టైమివ్వకుండా తాను తప్పు చేశానని.. తనను క్షమించాలని బండి సంజయ్ కోరారు. తన కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం జరుగుతుందని బండి సంజయ్ ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని తన కొడుకు చెబుతున్నాడని చెప్పారు. అయినా తన కొడుకును తాను సమర్ధించడం లేదన్న బండి సంజయ్… తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తానని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.

ఈ సమయంలోనే తన భార్య సైతం తనను ఫాలో అవుతోందని.. తాను లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు తన కుటుంబానికి నిప్పంటించారని ఫైర్ అయ్యారు. ఆ నిప్పుతో అవినీతి వ్యవస్థను దగ్దం చేస్తానని.. అవినీతి, కుట్రలు చేసే గడీల బద్దలు కొడతానని శపథం చేశారు. తనను, తన కుటుంబాన్ని, తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టినోడిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంతేకాదు తప్పుడు కేసులపై బండి సంజయ్ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాషాయ జెండా పట్టి కష్టాలు పడుతూనే ఉన్నా… అయినా బాధపడను.. ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. తన చివరి శ్వాస వరకు హిందూ ధర్మం కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>