epaper
Wednesday, February 18, 2026
epaper

రేవంత్‌.. నీ ఆట నేను ముగిస్తా: బండి సంజ‌య్

క‌లం, వెబ్ డెస్క్‌: ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల‌తో చేతులు క‌లిపి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మొద‌లుపెట్టిన ఆట‌ను ముగిస్తాన‌ని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్(Bandi Sanjay) వ్యాఖ్యానించారు. బీజేపీ క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ (Karimnagar Corporation) పీఠాన్ని కైవ‌సం చేసుకున్న సంద‌ర్భంగా బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్, సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లను బండి సంజ‌య్ అభినందించారు. ఈ ఎన్నిక‌కు తీవ్రంగా అడ్డుప‌డ్డారంటూ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్ఎస్‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కకుండా సీఎం రేవంత్ త‌న‌ మంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి చేయని కుట్రలు లేవ‌న్నారు. అయినా బండి సంజయ్ రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు ఆ కుట్రలన్నీ పటాపంచ‌ల‌య్యాయ‌ని చెప్పారు.

క్రికెట్‌లో ఇండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించినట్లే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో అందరినీ ఓడించి బీజేపీ కప్ గెలుకుంద‌ని బండి అన్నారు. అనవసరంగా, అప్రజాస్వామికంగా త‌న‌ను కెలికి ఆట మొదలుపెట్టార‌ని, ఇక ఈ ఆటకు నేను ముగింపు ఇస్తానంటూ బండి అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావడానికి కారణమేంట‌ని బండి ప్ర‌శ్నించారు. ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫామ్ హౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశార‌ని నిల‌దీశారు. కాంగ్రెస్ 14 సీట్లు, ఎంఐఎం 3, బీఆర్ఎస్ 9 సీట్లు గెలిచాయ‌ని, అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే ఉన్నాయి చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ దాటక‌పోయినా ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ చీకటి ఒప్పందాలేమిటి? అంటూ ప్ర‌శ్న‌లు సంధించారు.

కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేయాలని ఎన్నో ఏళ్లుగా కల కన్నామ‌ని, ఈ రోజు కోసం ప్రజలంతా ఎదురు చూశార‌ని, ఆ కల సాకారమైనందుకు సంతోషంగా ఉంద‌ని బండి వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఏ రాజ‌కీయ మార్పుకైనా క‌రంన‌గ‌ర్ వేదిక‌వుతుంద‌ని, అందులో భాగంగానే కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటై కుట్ర చేశాయ‌న్నారు. కానీ ప్రజల సహకారం, అమ్మవారి ఆశీస్సులతో ఆ కుట్రలన్నీ భగ్నం చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. .

2005లో ఇదే రోజు కార్పొరేటర్‌గా తొలిసారి ఎన్నికైనప్పుడు ఎంతో సంతోషపడ్డాన‌ని, మళ్లీ ఇదే కార్పొరేషన్ పై మేయర్ పీఠాన్ని బీజేపీని దక్కించుకున్నందుకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంద‌ని బండి (Bandi Sanjay) చెప్పారు. త‌మ మేయ‌ర్‌, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు నీతిమంతుల‌ని, అవినీతికి ఆస్కారం లేకుండా పని చేస్తార‌ని హామీ ఇచ్చారు. కార్పొరేషన్‌లో అవినీతికి తావు లేకుండా ప్రజలకు అండగా ఉంటూ కరీంనగర్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామ‌న్నారు. ఎన్నికల వరకే రాజకీయాల‌ని, ఎన్నికల తరువాత అభివృద్ధే త‌మ‌ లక్ష్యమ‌ని చెప్పారు. ఇందు కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. కరీంనగర్ అభివృద్ధి విషయంలో ప్రజలు లేటైనా లేటెస్టుగా తీర్పునిచ్చార‌ని బండి అన్నారు. బీజేపీకి అధిక మెజారిటీని ఇచ్చి ఆశీర్వదించార‌ని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసి కరీంనగర్‌కు అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేసే దాకా ప్ర‌భుత్వం మెడలు వంచుతామ‌ని బండి సంజ‌య్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి ముగింపు పలుకుతామ‌న్నారు. అందుకు కరీంనగర్‌ వేదిక కాబోతోంద‌ని చెప్పారు. గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను చూసి ఎవ్వ‌రూ భయపడలేద‌ని చెప్పారు. కనీస వ్యూహం, ఎత్తుగడలు లేకుండా వ్యవహరించిన తీరును చూసి అంతా నవ్వుకున్నామ‌న్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పంథాను చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నాన‌ని బండి చెప్పారు. ప్రజాస్వామ్య తీర్పును శిరసావహించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన తీరు గొప్ప విషయ‌మ‌న్నారు.

Read Also: హైదరాబాద్‌లో రూ.కోటి విలువైన ఆభరణాలు చోరీ..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>