కలం, కరీంనగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదని, తెలంగాణ లూటర్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. తెలంగాణ సొమ్మును దోచుకుని కేరళ ఎన్నికల్లో ఖర్చు చేశారని మండిపడ్డారు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే… తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు కదా? అక్కడెందుకు గెలవలేదు? అని ప్రశ్నించారు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే రాహుల్ గాంధీ పప్పు సుద్దేనా? అని ఎద్దేవా చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలవడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది త్రిమూర్తుల (మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్) విజయమని అభివర్ణించారు. కాందిశీకుల భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కయ్యారని, త్వరలో ఆధారాలను బయటపెడతానంటూ మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్.. 48 గంటలు టైమిస్తున్నా. నువ్వు మనిషివైతే ఆధారాలను బయటపెట్టు. లేకుంటే నువ్వు చీమకంటే హీనమైన వాడివని ఊరూవాడా ప్రచారం చేస్తా. నిన్ను కరీంనగర్ లో అడుగుపెట్టనీయబోను’’ అని సవాల్ విసిరారు. కేటీఆర్ కు దమ్ముంటే.. బండి సంజయ్, కేటీఆర్ ఆస్తులపై విచారణ జరిపించేందుకు సిద్ధం కావాలని అన్నారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు.
బండి సంజయ్ ఏమన్నారంటే..
5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమి అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయం సాధించడం సంతోషం. బీజేపీ సైద్దాంతిక విజయమిది. అభివ్రుద్ధి, జాతీయవాదానికి ఓటేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. మోదీపట్ల ప్రజల నమ్మకం మరింత పెరిగిందనడానికి ఫలితాలే నిదర్శనం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివ్రుద్ది సాధ్యమని ప్రజలు నమ్మి ఓట్లేశారు. మోదీ, అమిత్ షా, నితిన్ త్రిమూర్తులు. ఇది త్రిమూర్తుల విజయం. 3 రాష్ట్రాల విజయం బీజేపీ కార్యకర్తలందరికీ స్పూర్తిదాయకం. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు దోహదం. అస్సాంలో ఆత్మగౌరవం గెలిచింది. ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న క్రుషికి నిలువెత్తు నిదర్శనం. హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి గతంకంటే ఎక్కువ సీట్లతో అధికారం చేపట్టబోతోంది.
బెంగాల్ లో 200 సీట్లకుపైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుండటం సంతోషం. బంగ్లాదేశ్ నుండి వచ్చిన చొరబాటుదారులతో గెలవాలని టీఎంసీ చూసింది. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేశారు. వాళ్ల ఇండ్లను ధ్వంసం చేశారు. కేంద్ర హోంమంత్రిని గూండా అని దుష్ప్రచారం చేశారు. టీఎంసీ ఎన్ని అరాచకాలు చేసినా దాడులను ఎదుర్కొని పోరాడిన బీజేపీ కార్యకర్తల త్యాగాలు ఫలించాయి. రాష్ట్రపతి, ప్రధానిని అవమానించిన టీఎంసీని అక్కడి ప్రజలు చీత్కరించారు. మమతా బెనర్జీ మళ్లీ గెలుస్తుందని విశ్లేషకులు వేసిన అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. జై బంగ్లా, జై శ్రీరాం నినాదాలు ఫలించాయి. అందరి అంచనాలు తారుమారు చేస్తూ హిందూ ఓటు బ్యాంకు ఏకమై బీజేపీని గెలిపించాయి.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని చీల్చే కుట్రలు చేశారు. స్టాలిన్, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా అక్కడి ప్రజలు చెంప చెళ్లుమన్పించారు. చివరకు స్టాలిన్ పోటీ చేసిన చోట కూడా ఓడించారు. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. దేశాన్ని విభజించాలనుకుంటే ఏ విధంగా గుణపాఠం చెబుతారో తమిళనాడు ప్రజలు నిరూపించారు. కేరళలో కాంగ్రెస్ గెలిచినా ఇండీ కూటమి నిలువునా చీలిపోయింది. కేరళలో సీపీఎం, కాంగ్రెస్ మధ్య యుద్దం జరిగింది. బెంగాల్ లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య తిరుగుబాటు జరిగింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క రాష్ట్రం గెలిచినంత మాత్రాన సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ అవుతారా?. తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాంలో కూడా ప్రచారం చేశారు కదా? అక్కడ ఓడిపోయింది కదా?. ఏ సినిమా అయినా హిట్ అయితే ఐటమ్ సాంగ్ చేసినోళ్లు నావల్లే అనుకున్నట్లుంది. కేరళలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే సహా 40 మంది స్టార్ క్యాంపెయిన్ చేశారు. రాహుల్ గాంధీ పప్పు సుద్దేనా?
రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజర్ కాదు… తెలంగాణ లూటర్. తెలంగాణ సొమ్మును దోచుకుపోయి కేరళలో ఖర్చు చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటి వరకు 99 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తించడం లేదు. రేవంత్ గేమ్ ఛేంజర్ అయితే… కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైంది?. ఇంట్లో ఈగల మోత…బయట పల్లకీ మోత అన్నట్లుంది రేవంత్ రెడ్డి వ్యవహారం. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుకు దిక్కులేదు కానీ ఇక్కడ ప్రజల సొమ్ము తీసుకుపోయి కేరళలో ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే చేశారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది.
దేశంలో కాషాయ గాలీ వీస్తోంది. అసోం నుండి బెంగాల్ కు కాషాయ గాలి వీచింది. బెంగాల్ నుండి తెలంగాణకు కాషాయ గాలి వీచడం ఖాయం. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం. ఈనెల 10న మోదీ సభను విజయవంతం చేయండి. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి తెలంగాణకు పీఎం వస్తున్నరు. ప్రతి ఒక్కరూ పరేడ్ మైదానానికి రావాలని కోరుతున్నా. కేరళ, తమిళనాడులో బీజేపీ ఓడిపోయినా ఓట్ల శాతం పెంచుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతవల్లే ఓడిపోయామని మమత చెప్పడం హాస్యాస్పదం. అసోంలొ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా.. మరి ఎట్లా గెలిచింది.
కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్నది కేసీఆర్. అదే జరిగే హరీశ్ రావు ఊరుకుంటారా? ఇప్పటికే కూతురు బయటకొచ్చి పార్టీ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మనుగడ ఉంటుందా? ఉండదా? అనేది ప్రశ్నార్థకమే. నేను రేవంత్ రెడ్డిని విమర్శించడం లేదని కేటీఆర్ చెప్పడం జోక్. కాందిశీకుల భూముల వ్యవహారంపై నాపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ నిజంగా మనిషి పుట్టుక పుడితే.. ఆ ఆధారాలను బయటపెట్టాలి. 48 గంటలు టైమిస్తున్నా.. ఆ వ్యవహారాన్ని బయటపెట్టాలి. లేకపోతే చీమకంటే హీనమైన బతుకు కేటీఆర్ ది అని ఊరూవాడా ప్రచారం చేస్తా. కేటీఆర్ బతుకే తుచ్చం. కేటీఆర్ కు దమ్ముంటే… ఇద్దరి ఆస్తిపాస్తులపై విచారణకు సిద్ధమా?. కాందిశీకుల భూముల వ్యవహారంలో నేను అవినీతికి పాల్పడ్డట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా. లేనిపక్షంలో కేటీఆర్ బతుకును బజారుకీడుస్తా. డ్రగ్స్ తీసుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారేమో. కేటీఆర్…ఫాల్తు రాజకీయాలు మానుకో. పక్కా ఆధారాలుంటే బయటపెట్టు. నాపై ఆధారాలను చూపకపోతే నిన్ను కరీంనగర్ లో అడుగుపెట్టనీయం. రేవంత్, కేటీఆర్ ముమ్మాటికీ దోస్తులే. అందుకే డ్రగ్స్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఈఫార్ములా సహా అన్నీ స్కాంలను అటకెక్కించారు. మీ ఇద్దరి చీకటి దోస్తీ వ్యవహారాలను త్వరలో నేనే బయటపెడతా.

