Mobile Popup Ad
Mobile Popup Ad

7 ఏళ్లలో రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని.. అలాగే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ మూర్ఖపు పాలనవల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని విమర్శించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుండి నిధులొస్తున్నాయని తెలిపారు. గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా తగిన నిధులొస్తున్నాయని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ఎన్నికల తరువాత గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. గత ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానని చెప్పారు. అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. మేడిపల్లి గోవిందారం, మల్యాల నుండి కాచారం రోడ్ల విస్తరణ పనులకు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విస్తరించామన్నారు.

ఆది శ్రీనివాస్‌తో కలిసి అభివృద్ధి పనులు..

ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బొల్లారం గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ తో కలిసి వేమలవాడ-సిరికొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా బొల్లారం నుండి సిరికొండ వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిశ్రీనివాస్, బీజేపీ నేతలు ప్రతాప రామక్రిష్ణ, చెన్నమనేని వికాస్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో భాగంగా వేములవాడ నుండి సిరికొండ వరకు దాదాపు 18.21 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ, బలోపేతం చేసే పనులకు ఆది శ్రీనివాస్ (Aadi Srinivas)తో కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేంద్రం CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) కింద ఈ పనులకు 23 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఒప్పందం ప్రకారం.. 6 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని గడువు విధించడం జరిగిందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా రహదారి విస్తరణ, బలోపేతం తోపాటు మధ్యమధ్యలో సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణం, పైప్ కల్వర్టుల నిర్మాణం, గ్రామాల పరిధిలో సీసీ డ్రైన్ల ఏర్పాటు, రోడ్డు భద్రతా చర్యలకు సంబంధించిన పనులు కూడా చేపట్టాల్సి ఉందన్నారు. మామిడిపల్లి, బావుసాయిపేట, రామన్నపల్లి, గోవిందరావుపేట తండా గ్రామాలతోపాటు ఈ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణీకులకు, వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుందని చెప్పారు.

కేవలం జాతీయ రహదారుల విస్తరణ కోసమే 5 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చామని బండి సంజయ్ అన్నారు. దీంతోపాటు CRIF (సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్), జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి మిగిలిన నిధులు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నామని తెలిపారు . ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసిన ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవు అని అన్నారు.

మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం..

“మీకు తెలుసు… ఇటీవల చొప్పదండి మండలం అర్నకొండ గ్రామం నుండి గోపాల్ రావు మీదుగా మల్యాల వరకు 50 కోట్ల రూపాయల వ్యయంతో 35 కి.మీల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ రోడ్డుగా విస్తరించే పనులను ప్రారంభించుకున్నం. మొత్తం 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రోడ్డును విస్తరించబోతున్నాం. జాతీయ రహదారుల విషయానికొస్తే… 2 వేల 147 కోట్లు నిధులతో కరీంనగర్-వరంగల్ నేషనల్ హైవే, 578 కోట్ల రూపాయలతో ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల ప్రజల చిరకాల వాంఛగా ఉన్న కరీంనగర్ – జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.2 వేల 3 కోట్లకుపైగా నిధులు మంజూరు చేసింది. ఈ విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూర్తిగా సహకరిస్తున్నారు. ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రిని కూడా కలిశాం. అతి త్వరలోనే పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా సహకరిస్తున్నారు.

నేను మళ్లీ చెబుతున్నా.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అట్లనే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివ్రుద్ధి సాధ్యం. రాష్ట్రం ప్రతిపాదనలు పంపితేనే కేంద్రం నిధులిస్తుంది. గత ప్రభుత్వానికి సోయి లేకపోవడంవల్ల, మూర్ఖపు పాలనవల్ల తెలంగాణ చాలా నష్టపోయింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుండి నిధులొస్తున్నాయి. గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా తగిన నిధులిస్తోంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు. ఎన్నికల తరువాత నా ధ్యాస, శ్వాస అంతా అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ డెవలప్ మెంట్ కోసం ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తా. గ్రామగ్రామాన, గల్లీగల్లీలో రోడ్లు వేయిస్తా. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుంటూ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే వివక్ష లేకుండా ఓటేసిన ప్రజల ఆకాంక్ష మేరకు చేయి చేయి కలుపుదాం.. వేములవాడ, సిరిసిల్ల సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. కలిసి రావాలని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను, నాయకులను కోరుతున్నా” అని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>