Mobile Popup Ad
Mobile Popup Ad

న్యూస్ పేపర్‌లో చుట్టిన ఆహారం తింటున్నారా? ఈ ముప్పులు తెలుసుకోండి

కలం, వెబ్‌డెస్క్: మనం బయటి నుంచి తెచ్చుకునే తినుబండారాలను న్యూస్ పేపర్‌లో ప్యాక్ చేసి ఇస్తుంటారు వీధి వ్యాపారులు. ఉదాహరణకు.. సమోసా, బజ్జీ, కచోరీ, జిలేబీ వంటివి పార్శిల్ చేయడానికి న్యూస్ పేపర్లు వాడుతుంటారు. అంతేకాదు మనం ఇంట్లో తయారుచేసుకునే పూరీల నుంచి అదనపు నూనెను తొలగించేందుకు కూడా న్యూస్ పేపర్లు వాడుతుంటాం. అయితే, న్యూస్ పేపర్‌లో ఫుడ్ ప్యాకింగ్ ప్రమాదకరమని మీకు తెలుసా? అవును మనకు తెలియకుండానే ఈ పేపర్ల ద్వారా శరీరంలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయని హెచ్చరిస్తోంది ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI Warns)’.

వీధి వ్యాపారులు ఫుడ్ ప్యాకింగ్ కోసం వార్తా పత్రికలను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. వీటిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్యాకింగ్ కోసం పేపర్ ఉపయోగించడంపై తాజాగా నిషేధం విధించింది FSSAI సంస్థ. ఈ తరహా ప్యాకింగ్ వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆహారాన్ని న్యూస్ పేపర్‌లో చుట్టడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి సమస్యలొస్తాయంటే..?

1. విషపూరిత లోహాల విడుదల

తినుబండారాలను న్యూస్ పేపర్‌లో చుట్టడం వలన వార్తా పత్రికల ప్రింటింగ్ ఇంక్‌లో ఉండే విషపూరిత రసాయనాలు, లెడ్/క్రోమియం/కాడ్మియం.. వంటి లోహాలు ఆహారంలోకి విడుదల అవుతాయట. ఈ ఆహార పదార్థాలు తినడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఇలా కలుషితమైన ఆహారాన్ని తినడం ప్రమాదకరం..’ అన్న సందేశంతో కూడిన వీడియోను ఆహార భద్రతా సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఈ విధంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు.

2. హార్మోన్ల అసమతుల్యత

న్యూస్ పేపర్ ఇంక్‌లో ఉండే హానికారక రసాయనాలు, రంగులు మన శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇరెగ్యులర్ పీరియడ్స్, పీఎంఓఎస్, సంతానలేమి, చిన్న వయసులోనే రజస్వల కావడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు.

3. గర్భిణులకు ప్రమాదం

న్యూస్ పేపర్‌లో చుట్టిన ఆహారం గర్భిణులు తీసుకోవడం వలన పుట్టబోయే బిడ్డలో అవకరాలు, నెలలు నిండకముందే ప్రసవం కావడం, శిశువులు తక్కువ బరువుతో జన్మించడం.. వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

4. క్యాన్సర్ ముప్పు

తరచుగా న్యూస్ పేపర్లలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యల బారినపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

5. బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్లు

వార్తాపత్రిక ప్రింటింగ్ ప్రెస్‌లో తయారైనప్పటి నుండి పేపర్ బాయ్ చేతుల మీదుగా మన ఇంటికి లేదా హోటల్‌కు వచ్చేసరికి ఎంతోమంది చేతులు మారుతుంది. అపరిశుభ్రమైన ఉపరితలం పైనా వార్తా పత్రికలను పడేస్తుంటారు. ఇలాంటి పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వాడితే.. వాటిపై ఉండే బ్యాక్టీరియా ఆహారంలోకి చేరుతుంది. తద్వారా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

6. అవయవాల పనితీరు దెబ్బతినడం

న్యూస్ పేపర్ ఇంక్‌లో ఉండే హానికారక రసాయనాలు, కృత్రిమ రంగులు రోగనిరోధక వ్యవస్థ పనితీరునూ దెబ్బతీస్తాయట. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతే కాకుండా అటు నాడీ వ్యవస్థ, ఇటు మూత్రపిండాల పనితీరు పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఈ ప్రత్యామ్నాయాలు మేలట!

ఫుడ్ ప్యాకింగ్, ర్యాపింగ్ కోసం వార్తా పత్రికల్ని వాడి లేని ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకోవడం కంటే.. దీనికోసం కొన్ని ప్రత్యామ్నాయాల్ని పాటించడం మేలంటున్నారు నిపుణులు.

* అరటి, అరేకా పామ్.. వంటి ఆకులతో తయారుచేసిన పర్యావరణహితమైన ఉత్పత్తులను ప్యాకింగ్ కోసం ఉపయోగించడం

* నూనె, తడి ఆహార పదార్థాల కోసం బటర్ పేపర్, ఫుడ్ గ్రేడ్ ర్యాపింగ్ పేపర్.. వంటివి వాడటం.

* పొడి పదార్థాల కోసం బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ వాడటం

* కార్న్ స్టార్చ్‌తో తయారుచేసిన ఫుడ్ ప్యాకేజింగ్ బాక్సులు

ఇలా ఆయా ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసం ఆరోగ్యకరమైన ప్యాకింగ్ మెటీరియల్‌ను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బయటికెళ్లినప్పుడు ఆయా ఫుడ్ సర్వింగ్, ప్యాకింగ్ కట్లరీని వెంట ఉంచుకుంటే మరీ మంచిది. ఆయా దుకాణాలలో ఇవి లేకపోయినా.. మన దగ్గర ఉన్నవి వాడుకోవచ్చు. తద్వారా ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండానూ జాగ్రత్తపడచ్చు.. అని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>