కలం, కరీంనగర్ బ్యూరో: మోదీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజవర్గాల్లో ఈ నెల 13న ‘‘స్వచ్ఛ పాఠశాల’’ను ప్రారంభించబోతున్నారు. అన్ని ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ చైతన్యపురిలో జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేసి ముస్తాబు చేయాలని పిలుపునిచ్చారు. రేపు మండలాల వారీగా పార్టీ కార్యకర్తలు సమావేశమై ఒక్కో పాఠశాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించాలని సూచించారు.
ఈసారి బ్రాండెడ్ సైకిళ్లు అందిస్తాం..
ఈ నెల 11, 12వ తేదీల్లో బీజేపీ కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ‘‘టిఫిన్ బైఠక్’’ పేరుతో సమావేశం నిర్వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతి తరగతి గదికి ఇద్దరు చొప్పున కార్యకర్తలను కేటాయించి.. 13వ తేదీలోగా శుభ్రం చేయించాలి. చీపురు, క్లాత్ వంటి వస్తువులను తీసుకెళ్లాలి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని కోరారు. ప్రతి గ్రామంలో ‘‘మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చించండి’’ అనే నినాదంతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే, ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందిస్తానని వెల్లడించారు. గిన్నిస్ రికార్డు స్థాయిలో ఒకే సారి ఒకే సమయంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు.
రేపు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు..
12 ఏళ్ల మోదీ పాలనను పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేపు ఉదయం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

