కలం, కరీంనగర్ బ్యూరో : అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘అభినవ గోబెల్స్’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. అబద్దాలు, మోసాలు చేసే వారినే ప్రజలు నమ్ముతారని బహిరంగంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ అబద్దాల పునాదులపైనే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి మహిళలకు ప్రతినెలా రూ.2500లు చెల్లిస్తామని, తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక హామీలకు తూట్లు పొడిచారని ఆయన (Bandi Sanjay) మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్లుందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే దొంగ హామీలు, పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతూ పాలనను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేసే నాయకులపై బురద చల్లడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇండీ కూటమి నేతలు బిల్లును అడ్డుకున్నారు. ఈ విషయంలో లేనిపోని విష ప్రచారం చేసి మహిళా బిల్లును అడ్డుకోవడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని విమర్శించారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టం జరుగబోతోందని తప్పుడు ప్రచారాలకు తెరదీసి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు పెరగకుండా కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది వాస్తవమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రతి రాష్ట్రానికి 50 శాతం సీట్లు పెంచడం ద్వారా దక్షిణాదికి మేలు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు.
కానీ, ఇండీ కూటమి పేరుతో అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి తోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ఇండీ కూటమి నేతలు దక్షిణాదికి ఉన్న అవకాశాలకు గండికొట్టారని, దక్షిణాదికి తీరని నష్టం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కుటిల రాజకీయాలతో మహిళల కలలను కల్లలు చేశారని, మహిళా బిల్లును అడ్డుకుని ఏదో సాధించామని సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ మహిళలతోపాటు దేశంలోని 70 కోట్ల మహిళలెవరూ ఇండీ కూటమి చేసిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోరన్నారు. అతి త్వరలోనే రేవంత్ రెడ్డి సహా ఇండీ కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. మహిళలంతా ఏకమై రేవంత్ రెడ్డి సర్కార్ ను గద్దె దించడం తథ్యమన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను తెలంగాణలోని గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఆధ్వర్యంలోని పార్టీ నాయకత్వం సిద్ధమవుతోందని బండి వెల్లడించారు.

