కలం, వెబ్ డెస్క్: చట్టం మీద గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు స్వయంగా అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఇలా చేసిన ఏకైక నాయకుడు కూడా తానేనని స్పష్టం చేశారు. ఇటీవల పరిణామాల తరువాత, తొలిసారి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీపై ప్రేమ ఉన్న వ్యక్తిని అని.. తుది శ్వాస విడిచాక భౌతిక దేహంపై బీజేపీ జెండా కప్పాలనే చివరి కోరిక ఉన్న ఎంతో మంది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ పెడుతారా.. అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
‘అన్నీ కోర్టులోనే తేలుతాయి..’
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో తనను అరెస్ట్ చేస్తారనే విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని.. అన్నీ కోర్టులోనే తేలుతాయన్నారు. కేసీఆర్ కొడుకు మాదిరి తాను ఫేక్ మీడియా సంస్థలు నడిపి దుష్ప్రచారం చేయబోనన్నారు. వాళ్ల గడీలు బద్దలు కొట్టినందుకే, ఫ్రస్టేషన్‌తో ఏదో ఏదో చేస్తుంటారని.. అవన్నీ పట్టించుకోమన్నారు. కేసీఆర్ దగ్గర 17 మంది ఎంపీలు ఉన్నారా?… ఆయన దయాదాక్షిణ్యాలతో మోదీ ప్రభుత్వం నడుస్తున్నదా?.. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు కదా.. అని ఎద్దేవా చేశారు.
డబ్బులు కుమ్మరించి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ..
తనపై జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “కేసీఆర్ కొడుకు విసిరే చిల్లర మెతుకులకు ఆశపడి ఒకటో రెండో టీవీ ఛానెళ్లు, యూ ట్యూబ్ ఛానళ్లు ఫేక్ ప్రచారాన్న్ని మొదలుపెట్టాయి. రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అది చూసి కేసీఆర్ కొడుకు రాక్షసానందం పొందుతున్నాడు. ప్రతి నెలా కోట్ల రూపాయలను కుమ్మరించి ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాళ్ల దృష్టితో చూస్తే నన్ను అరెస్ట్ చేయాల్సిందేనేమో. నన్ను, నా పార్టీని బదనాం చేసేందుకు కేసీఆర్ కొడుకు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. నాపైన విష ప్రచారం చేస్తున్నాడు. ఎన్ని వండి వార్చినా జనం బీజేపీతోనే ఉన్నారు. ఫేక్ వార్తలను, ఫేక్ స్టోరీలను చూసి జనం నవ్వుకుంటున్నారు.” అని మండిపడ్డారు.
బండి సంజయ్‌తో సెల్ఫీలకు కార్యకర్తల పోటీ..
బండి సంజయ్ చాలా రోజుల తర్వాత స్టేట్ పార్టీ ఆఫీసుకు రావడంతో “బీజేపీ జిందాబాద్.. మోదీ జిందాబాద్.. బండి సంజయ్ జిందాబాద్.. రామచంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి..” అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. “సంజయ్ జీ.. ఆప్ సంఘర్ష్ కరో… హమ్ ఆప్ కే సాథ్ హై..” అని నినదించారు. బండి సంజయ్‌ను కలిసి సంఘీభావం ప్రకటించారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దాదాపు రెండు గంటలపాటు పార్టీ కార్యకర్తలతో గడిపారు.

