Mobile Popup Ad
Mobile Popup Ad

‘పాలమూరు’ పూర్తి చేసి 1,226 గ్రామాలకు నీళ్లు అందిస్తాం: జూపల్లి

కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమగ్రమైన నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాల పురోగతిపై బుధవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో వాకిటి శ్రీహరితో జూపల్లి కలిసి పాల్గొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి తొలి దశలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 1,226 గ్రామాలకు తాగునీళ్లు అందిస్తామని జూపల్లి స్పష్టం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మరో పదిహేను రోజుల్లో ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పునఃసమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని జూపల్లి వెల్లడించారు. భారీగా మట్టి పేరుకుపోవడంతో నీటి సామర్ధ్యం నిల్వ 8 టీఎంసీల దిగువకు పడిపోయిన జూరాల ప్రాజెక్టులో పూడికతీసి నీటి సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు వీలుగా డీఆర్ ఐపీకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. పూడికతీత పనులతో నీటి సామర్ధ్యం నిలువలు గణనీయంగా పెరగడమే కాకుండా రిజర్వాయర్ భద్రత, నిర్వహణ మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. వర్షాకాలానికి ముందే చిన్నతరహా సాగునీటి చెరువులలో పూడికతీత పనులు చేపడతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>