నీటి కోసం రైతుల పోరుబాట.. పోత్తూరు బ్రిడ్జిపై భారీ ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో: ​రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో రైతులు పోరుబాట (Farmers Protest) పట్టారు. మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట మండలం పోత్తూరు బ్రిడ్జిపై గురువారం రైతులు భారీ ధర్నా నిర్వహించారు. సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం నీటి విడుదలలో తీవ్ర జాప్యం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సాగులో ఉన్న వరి పంటలకు ప్రస్తుతం అత్యవసరంగా నీరు అవసరమని.. ఇంకొంచెం ఆలస్యమైతే పంటలు పూర్తిగా దెబ్బతిని, తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ​వ్యవసాయాన్ని, తద్వారా తమను కాపాడాలంటే మిడ్ మానేరు జలాశయం నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు స్పందించి సాగునీటి విడుదలపై వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ​కాగా రైతుల ధర్నా కారణంగా పోత్తూరు బ్రిడ్జిపై కొంతసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>