కలం, వెబ్ డెస్క్ : కుడంకుళం (Kudankulam) అణు విద్యుత్ ప్రాజెక్ట్ (KKNPP) 3, 4 విభాగాలకు సంబంధించి ఇంటర్నెట్‌లో డేటా లీక్ అయిందంటూ వస్తున్న వార్తలపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) స్పందించింది. మీడియాలో ప్రచారమవుతున్న ఈ సమాచారం కేవలం సాధారణ పనులకు సంబంధించినదేనని, అణు భద్రత లేదా అణు రక్షణ వ్యవస్థలకు దీనితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కూడంకుళం (Kudankulam) ప్రాజెక్ట్‌కు చెందిన ‘కామన్ సర్వీసెస్ – బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్’ (BoP) ప్యాకేజీ కోసం ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్ట్‌ను 2018లో పబ్లిక్ టెండర్ ప్రక్రియ ద్వారా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు అప్పగించినట్లు ఎన్‌పీసీఐఎల్ తెలిపింది. ఈ కాంట్రాక్ట్ పరిధి కిందకు వచ్చే పనులు కేవలం సాధారణ మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాలకు మాత్రమే పరిమితమైనవని పేర్కొంది. సాధారణంగా థర్మల్ పవర్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలలో ఉండే ఇటువంటి సదుపాయాలకు, అణు రక్షణకు ఎటువంటి సంబంధం ఉండదని వివరించింది.
ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా తాము బిడ్డర్లకు అందించిన ప్రాథమిక నమూనా డ్రాయింగ్‌ల ఆధారంగా, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (OEMs) సంప్రదింపులతో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వివరణాత్మక ఇంజనీరింగ్ డ్రాయింగ్‌లను సిద్ధం చేసిందని, వాటిని సమీక్షించిన తర్వాతే తాము ఆమోదించామని ఎన్‌పీసీఐఎల్ వెల్లడించింది. పబ్లిక్ డొమైన్‌లోకి చేరినట్లు ప్రచారం జరుగుతున్న ఈ పత్రాలు కేవలం సాధారణమైనవేనని, దేశ రక్షణ లేదా అణు విద్యుత్ కేంద్ర భద్రతకు సంబంధించిన ఎటువంటి సున్నితమైన సమాచారం లీక్ కాలేదని ఎన్‌పీసీఐఎల్ పేర్కొంది.

