కలం, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ (Swatantra Bhardwaj)పై ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) వరుస పోస్టులతో రెచ్చిపోతున్నారు. భరద్వాజ్ ఒక నేరస్థుడు, దేశ వ్యతిరేకి, హింసాత్మక వ్యక్తి అంటూ తన ఎక్స్ ఖాతాలో నేడు పోస్టు చేశారు. భరద్వాజ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. దీనికి కారణం సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల్లో ఓ బాలిక పాల్గొనగా భరద్వాజ్ సదరు బాలిక తండ్రిపై దాడి చేశాడు. అతడి తల పగలగొట్టి, బాలికను బెదిరింపుకు గురి చేశాడు. బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల బెదిరింపులకు పాల్పడినందున పోలీసులు కేసు నమోదు చేశారు. భరద్వాజ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు కూడా నమోదైంది.
ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు భరద్వాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు ఒక్క రోజుకే జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకున్నాడు. ఇది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఓ దళిత వ్యక్తిపై దాడి చేసిన విషయాన్ని భరద్వాజ్ కెమెరా ముందు గొప్పగా చెప్పుకున్నారని, ఇలాంటి వాళ్లు దేశానికే ప్రమాదకరమని చిన్మయి ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా యువతులపై దాడులు, లైంగిక హింసకు సంబంధించిన భావజాలాన్ని భరద్వాజ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వైరల్ చేస్తున్నారని చిన్మయి ఆరోపించారు. కులం, మతం ఆధారంగా మెజారిటీ వర్గానికి నచ్చని వారిపై దాడులను సమర్థించే ధోరణి చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇలాంటి భావజాలాన్ని కొందరు సమర్థించడం ఆందోళనకరమని చిన్మయి అన్నారు. పిల్లలు, కుటుంబాల భద్రత కోసం ఇటువంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సౌత్ ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి హింసాత్మక ధోరణులు నియంత్రణ లేకుండా పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

