బీఆర్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నది -సీఎం

కలం, తెలంగాణ బ్యూరో : కేవలం రాజకీయాల కోసం దిగజారి ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ లీడర్లకు కనీసమైన మానవత్వం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy).. మనిషికి ఉండాల్సిన లక్షణాలు, విలువలు లేవన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు (Paddy Procurement) విషయంలో ఇప్పుడు BRS లీడర్లు ప్రవర్తిస్తున్న తీరు, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో అనుసరించిన విధానంగానే ఉన్నదన్నారు. గతంలో రైతులు వడ్లను అమ్మిన తర్వాత ప్రభుత్వం నుంచి పైసలు పడాలంటే నెలలు పట్టేదని, ఇప్పుడు మూడు రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని సీఎం గుర్తుచేశారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చనిపోయిన రైతు కుటుంబానికి అండగా ఉండాల్సిన బీఆర్ఎస్ లీడర్లు సంతోషంతో సెల్ఫీలు దిగేలా దిగజారుతున్నారని, శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం కోసం మరీ ఇంతగా దిగజారి వ్యవహరించాలా అని ప్రశ్నించారు.

వడ్ల కొనుగోళ్ళు 80% పూర్తయింది.. :

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు 80% పూర్తయిందని, ఇంకో 20% మాత్రమే మిగిలిందని సీఎం తెలిపారు. ధాన్యం కొనుగోళ్ళలో కొన్ని సమస్యలు ఉన్నది నిజమేనని, కానీ దానికి నిర్దిష్టమైన కారణాలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా బెంగాల్ కార్మికులు ఈ పనుల్లో ఉన్నారని, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసమని వెళ్ళి చాలామంది ఇంకా తిరిగి రాలేదన్నారు. ఈ కారణంగానే ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ సమస్య ఏర్పడిందన్నారు. ఇప్పుడిప్పుడే దారిన పడుతున్నదన్నారు. గతంలో ‘వరి వేస్తే ఉరి’ అని చెప్పినవారే ఇప్పుడు రైతుల ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వాన్ని విమర్శించడం బాధ్యతారాహిత్యమన్నారు. నిజంగా రైతులపై ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న బీఆర్ఎస్ లీడర్లు రైతులకు మేలు చేయడానికి ఒక్క పనైనా చేశారా అని సీఎం ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కు పాల్పడుతున్నది :

రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తున్నారని, లేబర్ సమస్య కారణంగా కొనుగోళ్ళ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని గుర్తుచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నీచమైన పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు. ఐకేపీ సెంటర్ల నుంచి వడ్ల బస్తాలను లారీల్లోకి ఎక్కించి రైస్ మిల్లులకు పంపిస్తే స్థానిక బీఆర్ఎస్ నాయకులు మిల్లర్లపై ఒత్తిడి తెచ్చి అన్‌లోడింగ్ పనులకు అడ్డం పడుతున్నారని సీఎం ఆరోపించారు. రైతులకు మేలు చేసే ఉద్దేశం నిజంగా ఉంటే సహకరించడానికి బదులు కాళ్లల్లో కట్టె పెట్టే తీరులో వ్యవహరించడాన్ని ఎవరైనా సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. సక్రమంగా జరిగే పనులకు అడ్డంకులు సృష్టించేలా బీఆర్ఎస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయిస్తున్నదని సీఎం ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>