కలం వెబ్ డెస్క్ : బళ్లారి(Ballari)లో ఫ్లెక్సీలతో మొదలైన వివాదం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) హత్యాయత్నానికి దారితీసి నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి నగరంలో వాల్మీకి విగ్రహ(Valmiki Statue) ఆవిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి నివాసం ముందు బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి(Bharat Reddy) అనుచరులు ఫ్లెక్సీలు కట్టబోయారు. దీన్ని జనార్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ఆ తర్వాత రాళ్ల దాడులు, కాల్పులు జరిగాయి. జనార్ధన్ రెడ్డి టార్గెట్‌గా భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్ మెన్ వద్ద గన్ లాక్కొని కాల్పులు జరిపారు. జనార్ధన్ రెడ్డి ఈ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. పోలీసులు కూడా గాలిలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు. ఈ ఘర్షణ జరిగినప్పడు ఇద్దరు ఎమ్మెల్యేలు నగరంలో లేరు. సమాచారం అందుకున్న వెంటనే వారిద్దరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మాజీ మంత్రి శ్రీరాములు సైతం పోలీసులకు సమాచారం ఇచ్చి ఘటనా స్థలానికి వచ్చారు.
ఈ ఘటనపై భరత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కార్యకర్తను జనార్ధన్ రెడ్డి అనుచరులే చంపేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బళ్లారి (Ballari) శాంతియుతంగా ఉందని, వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశామన్నారు. దాన్ని భంగపరచడానికే జనార్ధన్ రెడ్డి ఈ అల్లరి సృష్టించారని ఆరోపించారు. బీజేపీ(BJP) వాళ్లు ఎప్పుడూ వాల్మీకి పేరుతో రాజకీయాలు చేశారని, ఇప్పుడు వాల్మీకి వ్యతిరేకులుగా మారారని వ్యాఖ్యానించారు. జనార్ధన్ రెడ్డిని హత్య కేసులో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
జనార్ధన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తనపైనే హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. భరత్ రెడ్డి, అతని సన్నిహితుడు సతీష్ రెడ్డి, తండ్రి నారా సూర్యనారాయణ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నారన్నారు. తన ఇంటి ముందు సతీష్ రెడ్డి నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపారని ఆరోపించారు. కాల్పుల్లో వాడిన బుల్లెట్లను చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. వాల్మీకి విగ్రహం పేరుతో నగరంలో హింసను రెచ్చగొడుతున్నారని, క్రిమినల్స్‌ను పోషిస్తూ భరత్ రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఘటన తర్వాత ఇరు వర్గాల అనుచరులు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నగరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జనార్ధన్ రెడ్డి, శ్రీరాములు సహా పదిమందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: పొగమంచు ఎఫెక్ట్.. ఆరు నగరాల్లో ఫ్లైట్స్ ఆలస్యం
Follow Us On: Sharechat


