తృటిలో గెలుపు చేజారింది.. ఉన్నతి హుడా ఓటమి

కలం, స్పోర్ట్స్: బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఉన్నతి హుడాకు (Unnati Hooda) నిరాశ ఎదురైంది. 18 ఏళ్ల ఉన్నతి హోరాహోరీగా సాగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో కెనడా స్టార్ షట్లర్ మిషెల్ లీ (Michelle Li) చేతిలో ఓటమి పాలైంది. 21-11, 9-21, 21-23తో మ్యాచ్‌ను కోల్పోయింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఉన్నతి తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడింది. దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి 21-11తో గేమ్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో మిషెల్ లీ పుంజుకుంది. తన ఆటతీరును మార్చి ఉన్నతిపై ఒత్తిడి పెంచింది. దీంతో రెండో గేమ్‌ను 21-9తో గెలిచి మ్యాచ్‌ను 1-1తో సమం చేసింది.

విజేతను నిర్ణయించే మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా నెట్ వద్ద పోరు ఆసక్తికరంగా సాగింది. 20-19 వద్ద ఉన్నతికి మ్యాచ్ పాయింట్ లభించింది. అయితే ఆ అవకాశాన్ని మిషెల్ లీ సమర్థంగా ఎదుర్కొంది. ఆ తర్వాత కూడా ఉన్నతికి మరో రెండు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని విజయంగా మలచుకోలేకపోయింది. చివరికి మిషెల్ లీ 23-21తో నిర్ణాయక గేమ్‌ను గెలిచి తదుపరి రౌండ్‌కు చేరింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఉన్నతి హుడా ప్రయాణం ముగిసింది.

మ్యాచ్ అనంతరం ఉన్నతి మాట్లాడుతూ.. పోరు చాలా వరకు సమానంగా సాగిందని, చివరి దశలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం బాధగా ఉందని తెలిపింది. ఒక్క పాయింట్‌ను మాత్రమే తప్పుబట్టలేమని, నెట్ వద్ద జరిగిన పోరే మ్యాచ్‌లో కీలకంగా మారిందని పేర్కొంది. ఈ మ్యాచ్ నుంచి మంచి విషయాలను నేర్చుకుని ముందుకు సాగుతానని ఉన్నతి తెలిపింది. ముఖ్యంగా ఈ అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతుందని, తదుపరి ఆసియా క్రీడలకు మరింత సన్నద్ధమవుతానని పేర్కొంది. తృటిలో విజయం చేజారినా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఉన్నతి పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>