కలం, వెబ్ డెస్క్: అజారుద్దీన్(Azharuddin)ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గవర్నర్ వద్దకు ప్రతిపాదన పంపబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఆ పదవిలో కొనసాగాలంటే కచ్చితంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కావాల్సి ఉంది. అయితే కోర్టు కేసులు, వివిధ పరిణామాలతో ఈ అంశం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నెల 30లోగా ఆయన ఎమ్మెల్సీ అయితేనే మంత్రిగా కొనసాగే అర్హత ఉంటుంది. లేనట్లయితే మంత్రిపదవికి రాజీనామా చేయక తప్పదు. ఎమ్మెల్సీగా ఆమోదం తెలిపేందుకు గవర్నర్‌కు మరికొంత సమయం కావాలంటూ ఆయన తరఫున అటార్నీ జనరల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో ఈ నెలాఖరులోగా సానుకూల నిర్ణయం రావడం అనుమానంగా తయారైంది. ఒకవేళ గవర్నర్ ఆమోదం తెలపకపోతే వెంటనే మంత్రివర్గం నుంచి తప్పుకోక తప్పదు. అటు ఎమ్మెల్యేగానూ, ఇటు ఎమ్మెల్సీగానూ లేకుండా గతేడాది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరి రెండోసారైనా అజారుద్దీన్ ను గవర్నర్ ఎమ్మెల్సీగా నియమిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.

