కలం, స్పోర్ట్స్ : కామన్వెల్త్ గేమ్స్ 2026 ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే భారత్ తొలి పతకాన్ని ఖాయం చేసుకుంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న ఈ క్రీడల్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) మహిళల 75 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. అస్సాంకు చెందిన ఒలింపిక్ పతక విజేత లవ్లీనా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే చివరి నలుగురిలో చోటు దక్కించుకుంది. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు బాక్సర్లు మాత్రమే ఉండటంతో ఆమెకు నేరుగా సెమీఫైనల్ బెర్త్ లభించింది.
ఈ విభాగంలో ముగ్గురు బాక్సర్లకు నేరుగా సెమీఫైనల్ అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు మాత్రమే క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్లో ఓడిన ఇద్దరికీ కాంస్య పతకాలు ఇస్తారు. దీంతో లవ్లీనాకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. లవ్లీనా తన తొలి పోరును జూలై 31న సెమీఫైనల్లో తాఫాకీతో ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరడంతో పాటు కనీసం రజత పతకం ఖాయం అవుతుంది. ఓడినా కాంస్య పతకంతోనే గ్లాస్గో నుంచి తిరిగి వస్తుంది. ఇక భారత్ కామన్వెల్త్ గేమ్స్‌లో తన అధికారిక ప్రయాణాన్ని గురువారం ప్రారంభించనుంది. మొత్తం 124 మంది సభ్యులతో భారత బృందం బరిలోకి దిగుతోంది.

