కలం, వెబ్‌డెస్క్: పండ్లు (Fruits) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, చాలామందికి రాత్రి వేళల్లో డిన్నర్ ముగించిన తర్వాత హాయిగా పండ్లను తినే అలవాటు ఉంటుంది. పండ్లు ఆరోగ్యకరమైనవే అయినా, వాటిని సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం. భారీ భోజనం తర్వాత పండ్లు తీసుకోవడం సరైంది కాదు అంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయని, జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.`
సాధారణంగా పండ్లు మన శరీరంలో 20 నుంచి 40 నిమిషాల వ్యవధిలోనే జీర్ణం అవుతాయట. కానీ, మనం కడుపునిండా భోజనం చేసిన తర్వాత పండ్లను తింటే, అప్పటికే కడుపులో ఉన్న కొవ్వులు, కార్బోహైడ్రేట్లను అరిగించే పనిలో జీర్ణవ్యవస్థ బిజీగా ఉంటుంది. దీనివల్ల పండ్లు జీర్ణాశయంలోనే ఎక్కువ సేపు నిలిచిపోతాయి. అలా నిలిచిపోవడంతో పండ్లలోని సహజ చక్కెరలు పులిసిపోయి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అధిక తేన్పులు వంటి అసౌకర్యాలకు దారితీస్తాయని సూచిస్తున్నారు నిపుణులు. అయితే జీర్ణక్రియ సజావుగా సాగాలంటే భోజనంతో కలిపి పండ్లను తీసుకోవడం మానేయాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
సరైన సమయం
భోజనానికి ఒక గంట ముందు పండ్లు తింటే, అవి అప్పటికే జీర్ణమై శరీరానికి పూర్తి పోషకాలను అందిస్తాయట. సాయంత్రం వేళల్లో చిరుతిళ్లు తినే బదులు పండ్లను తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరి జీర్ణశక్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీ శరీరానికి ఏ సమయం సెట్ అవుతుందో గమనించుకుని పండ్ల సమయాన్ని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పండ్లు తినడం ఆరోగ్యమే, కానీ వాటిని తినే పద్ధతిని మార్చుకుంటేనే ఆ ఆరోగ్యం సంపూర్ణంగా అందుతుంది. భోజనం తర్వాత పండ్లను తినే అలవాటు ఉంటే, దానిని మానుకుని, విడిగా తీసుకుని చూడండి.. మీ జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు!

