epaper
Tuesday, November 18, 2025
epaper

మొంథా ఎఫెక్స్.. పునరావాస కేంద్రాలకు 12,315 మంది తరలింపు

మొంథా తుఫాను(Cyclone Montha) ప్రభావం కాకినాడపై భారీగా ఉంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. ఇప్పటికే జిల్లాలో తీర, లోతట్టు ప్రాంతాల్లోని 12,135 మంది ప్రజలను అన్ని వసతులతో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు(Rehabilitation Centers) తరలించి ఆశ్రయం కల్పించామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు.

మంగళవారం మద్యాహ్నం వరకూ జిల్లాలో చేపట్టిన తుఫాను రక్షణ, సహాయ చర్యలపై జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన జారీ చేస్తూ మొంధా తుఫాను ప్రభావానికి 18 మండలాల్లోని 67 గ్రామాలు, 5 పట్టన ఆవాసాలు లోనౌతున్నాయని, ఈ ప్రాంతాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు.

ఇందులో భాగంగా జిల్లా, డివిజన్ కేంద్రాలతోబాటు 21 మండలాల్లో 24 గంటలు పనిచేసే కంట్రోలు రూమ్ లు ఏర్పాటు చేసి తుఫాను(Cyclone Montha) పరిస్థితిని, సహాయ పునరావాస కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసామన్నారు. జిల్లాలో మొత్తం 401 పునరావాస కేంద్రాలను గుర్తించామని, ఇప్పటి వరకూ 76 కేంద్రాలు ప్రారంభించి, తుఫాను తాకిడికి గురికాగల ప్రాంతాలు, పూరి గుడిసెలు, బలహీన గృహాలలో నివశిస్తున్న 12,135 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం, త్రాగునీరు, ఇతర వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రజలకు త్రాగునీటి సరఫరాకు 24 ట్యాంకర్లు వినియోగిస్తున్నామని, ఆహార సరఫరాకు 191 మందిని, పాల సరఫరాకు ఒక సంస్థను గుర్తించి సంసిద్దంగా ఉంచామని, ఇప్పటి వరకూ 21,513 ఆహార పొట్లాలు, 1313 వాటర్ కాన్లు పంపిణీ చేసామని తెలిపారు. ముందు జాగ్రత్తగా 95 మంది గర్భిణులను, 1400 మంది బాలింతలను 52 ఆసుపత్రులకు, సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య పర్యవేక్షణలో ఉంచామన్నారు. పాఠశాలలన్నికి శెలవులు ప్రకటించామని, హాస్టళ్లలో చదువుతున్న 14,499 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపామని తెలిపారు. సముద్ర వేటవలో ఉన్న బోట్లన్నిటినీ తీరానికి రప్పించామని, 4,573 బోట్లు కొట్టుకుపోకుండా ఉప్పుటేరు, క్రీక్ లలో ఉంచుకోవాలని మత్స్యకారులకు సూచించామని తెలియజేసారు. .

తుఫాను సహయక చర్యలలో 85 విహెచ్ఎఫ్ సెట్లు, తాళ్లరేవు, యు.కొత్తపల్లి లలో 2 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేసి సమాచార వ్యవస్థను పటిష్టం చేసామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లాకు 30, 24 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 50 మంది సభ్యులతో ఒక ఎస్డిఆర్ఎఫ్ బృందం చేరుకుని రక్షణ, సహాయక సేవలందించేందుకు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే అత్యవసర సేవల కోసం 200 మంది గజఈత గాళ్లను నియమించామని, 100 మంది సిబ్బంది, 50 వేల లీటర్ల డీజిల్ తో 40 బోట్లను సిద్దం చేసామని తెలిపారు. కాకినాడ అర్బన్, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిపాడ్లు ఏర్పాటు చేశామన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 259 మెడికల్ క్యాంపులు నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టామని, 185 మంది వైద్యులు, 1710 మంది వైద్య సిబ్బంది, ఇరవై మూడు 108 ఆంబులెన్సులు, ముప్పై ఐదు 104 సంచార వైద్య వాహనాలను, ఇరవై రెండు 102 వాహానాలను ఈ సేవలకు నియోగించామని తెలిపారు. అలాగే 7150 యాంటీ రాబీస్ వాక్సీన్, 1773 యాంటీ స్నేక్ వెనమ్ డోసులు, 2.50 లక్షల క్లోరీన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంచామన్నారు. లోతట్టు ప్రాంతాలలోని 9901 పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 52 మంది పశువైద్యులతో 30 పశువైద్య శిభిరాలు ఏర్పాటు చేసి 200 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 17 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచామన్నారు

తుఫాను(Cyclone Montha) కారణంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ఎదురైయ్యే అంతరాయాలను, నష్టాలను ఎప్పటికప్పుడు పునరుద్దరించేందుకు 47 క్రేన్లు, 124 జనరేటర్లు, 66 ఫోర్క్ లిఫ్ట్ లు, 99 ఎస్కవేటర్లు, 28 రోడ్డు రోలర్లు, 26 ఫైర్ టెండర్లు, 4 డంపర్లు 12 హార్వెస్టర్లు అందుబాటులో ఉంచామని, సహాయ పునరావస కార్యక్రమాలకు 1602 పాఠశాల బస్సులు, 28 గూడ్స్ కారియర్లు, 907 ట్రాక్టర్లు, 3336 ట్రైలర్లను రంగంలో ఉంచామన్నారు. విద్యుత్ సరఫరా అంతరాయాలను ఎప్పటికప్పుడు పునరుద్దరించేందుకు 3 వేల స్థంబాలు, 44 క్రేన్లు, 33 ప్రయివేట్ వాహనాలు, 11 జేసీబీలు, 41 పోల్ డ్రిల్లింగ్ మిషన్లు, 45 జనరేటర్లు, 55 పవర్ రంపాలు, 526 కండక్టర్లు, 245 ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉంచి 1000 మంది సిబ్బందిని, కార్మికులను సంసిద్ధంగా ఉంచామన్నారు.

ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ద్వారా 20 సిపిడబ్ల్యూ స్కీములకు జనరేటర్ల బ్యాకప్ ఏర్పాటు చేసాం. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 1.34 లక్షల కేజీల బ్లీచింగ్, 3.25 లక్షల కేజీల లైమ్, 517 లీటర్ల సోడియం క్లోరేట్, 1535 లీటర్ల ఫినాయిల్, 2063 మంది సిబ్బంది ని అందుబాటులో ఉంచామని తెలిపారు. 49269 టన్నులు ఫోర్టఫైడ్ బియ్యం, 9.81 టన్నుల బెల్లం, రాగి పిండి, 296 టన్నుల పంచదార, 30185 నూనె పాకెట్లు, 10 టన్నుల ఉల్లిపాయలు, బంగాళాదుంప లు, 12 టన్నుల టమోటా పౌరసరఫరాల శాఖ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ప్రమాద కరమైన రూట్లలలో 44 ఆర్టీసీ బస్సులు రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

ప్రజా రక్షణకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టామని, ప్రజలు ఎటు వంటి ఆందోళనలకు లోను కాకుండా ఈ రక్షణ, సహాయ కార్యక్రమాలకు సహకరించాలని, తుఫాను సమయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ లకు వెంటనే తెలియజేయాలని జిల్లా కలెక్టర్ తమ ప్రకటనలో కోరారు. సురక్షిత ప్రదేశాలలో ఉండి, తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పడు తెలుసుకోవాలని, పెనుగాలులలోను, తుపాను తీరం దాటే సమయంలోను చెట్లు, స్థంబాల వద్ద, ఆరుబయట సంచరించ వద్దని ఆయన కోరారు.

Read Also: కోస్తా జిల్లాలకు ‘మొంథా’ ముప్పు ఇంకా ఉంది..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>