ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్లలోపు పిల్లలు ఇకపై ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌నీ ఉపయోగించకూడదని కఠిన ఆంక్షలు విధించింది. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని ప్రభుత్వం “ఆన్‌లైన్ సేఫ్టీ (ఎమెండ్‌మెంట్) బిల్–2024”ను అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం, 16 ఏళ్ల లోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ఏ సోషల్ మీడియా యాప్‌లలోనూ ఖాతా తెరవకూడదు. సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, సైబర్ వేధింపుల కేసులు పెరుగుతున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండా లేదా వయసు ధ్రువీకరణ లేకుండా పిల్లలు అకౌంట్లు సృష్టించడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
“పిల్లలను రక్షించడం మా ప్రభుత్వ ప్రధాన బాధ్యత. సోషల్ మీడియా కంపెనీలు తమ లాభాల కోసం చిన్నారుల మానసిక ప్రశాంతతను తాకట్టుపెడుతున్నాయి. ఇకపై ఆ పరిస్థితిని కొనసాగనివ్వం” అని స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలు వయస్సు ధృవీకరణ వ్యవస్థను తప్పనిసరిగా అమలు చేయాలి. నియమాలను ఉల్లంఘించిన సంస్థలకు కోట్ల డాలర్ల జరిమానాలు విధించే అవకాశం ఉంది.
సైకాలజిస్టులు, బాలల హక్కుల సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే, కొంతమంది నిపుణులు మాత్రం “పూర్తి నిషేధం కంటే డిజిటల్ విద్య, బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించడమే శ్రేయస్కరం” అని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణ చర్చకు నాంది పలికింది. ఇతర దేశాలు కూడా ఇలాంటి చట్టాలు తీసుకురావాలా? అన్న చర్చ మొదలవుతోంది.
Read Also: కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. జనాల ఉక్కిరిబిక్కిరి
Follow Us on : Pinterest

