కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత జోడీ ఎంఆర్ అర్జున్, హరిహరన్ అంసకరుణన్ శుభారంభం చేసింది. అమెరికా ఆటగాళ్లు ఆర్డెన్ క్వాన్ లీ, స్టాన్లీ జింగ్ జోడీపై వరుస గేమ్‌లలో విజయం సాధించి పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌కు చేరుకుంది. ఒలింపిక్ బౌలేవార్డ్‌లో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత జోడీ 21-13, 21-13 తేడాతో గెలిచింది. మొదటి గేమ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన అర్జున్-హరిహరన్ జోడీ సులభంగా గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో అమెరికా జోడీ కొంత పోటీ ఇచ్చింది. విరామ సమయానికి కేవలం ఒక పాయింట్ తేడాతో వెనుకబడి నిలిచింది. అయితే ఆ తర్వాత భారత జోడీ వరుసగా పాయింట్లు సాధిస్తూ మ్యాచ్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది. చివరకు నేరుగా రెండు గేమ్‌లలోనే విజయాన్ని ఖాయం చేసింది. మరోవైపు, భారత పురుషుల డబుల్స్ జోడీ అచుతాదిత్య రావు దొడ్డవరపు, అర్జున్ రెడ్డి పోచన తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. స్థానిక జోడీ కాంకి ఇగావా, ఊయ్ యే హెర్న్ చేతిలో 21-15, 21-15 స్కోరుతో ఓటమి చవిచూసింది.
దీంతో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ తరఫున అర్జున్-హరిహరన్ జోడీ మాత్రమే పోటీలో మిగిలింది. భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి ఈ టోర్నీకి దూరంగా ఉంది. గత వారం ఇండోనేషియాలో సాత్విక్ భుజానికి గాయం కావడంతో వారు ఈ పోటీలో పాల్గొనలేదు. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో సనీత్ దయానంద్ ప్రధాన డ్రాలో చోటు దక్కించుకున్నాడు. తన తొలి సూపర్ 500 టోర్నీలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు గెలిచి మెయిన్ డ్రాకు చేరాడు.
పురుషుల సింగిల్స్‌లో భారత్ ఆశలను సనీత్ దయానంద్, తరుణ్ మన్నెపల్లి ముందుకు తీసుకెళ్లనున్నారు. గత ఏడాది ఛాంపియన్ లక్ష్య సేన్ ఈసారి టైటిల్‌ను కాపాడుకునేందుకు బరిలో లేడు. అలాగే ఆయుష్ శెట్టి, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా చివరి క్షణంలో టోర్నీ నుంచి తప్పుకున్నారు. మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన ప్రచారాన్ని బుధవారం ప్రారంభించనుంది. పెరూ క్రీడాకారిణి ఇనెస్ లూసియా కాస్టిల్లో సలాజర్‌తో ఆమె తలపడనుంది. మాలవిక బన్సోడ్ కూడా పోటీలోకి దిగనుంది.

