కలం, వెబ్ డెస్క్ : పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ తాను విడుదల చేసిన వీడియో సందేశానికి దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నుంచి విశేష స్పందన రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ ఆయన ఇన్స్టాగ్రామ్లో మరో సరికొత్త వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశ యువత చూపించిన అపారమైన ప్రేమకు, వారు అందించిన ఆలోచనాత్మకమైన సూచనలకు ప్రధాని మోదీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వీడియో సందేశంలో ‘మీ నమ్మకమే నా అతిపెద్ద బలం’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశ యువతే మన భవిష్యత్తని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. నీట్ (NEET) పరీక్షా పత్రాల లీకేజీ వంటి ఉదంతాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల కష్టానికి, ప్రతిభకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని ప్రధాని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే ఏ ఒక్కరినీ, ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

