Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ కమిషనరేట్‌లో భద్రత కట్టుదిట్టం: సీపీ గౌష్ ఆలం

​కలం, కరీంనగర్ బ్యూరో: ​కరీంనగర్‌లో (Karimnagar) ఇటీవల జరిగిన పీఎంజే నగల షోరూంలో దారి దోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. మంగళవారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. సీపీకి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించగా, అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. పెండింగ్ కేసులు, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్‌లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రివెంటివ్ పోలీసింగ్, సీసీటీఎన్ఎస్ 2.0 (CCTNS 2.0), ‘ఈ-సాక్ష్య’ యాప్‌ల్లో కేసుల పూర్తి వివరాలను జూన్ 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలన్నారు. పాత పెండింగ్, కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి..

జిల్లా, మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేశామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బేసిక్ పోలీసింగ్‌లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు మరియు వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచినట్లు చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్స్‌లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ (జాగిలాలు) సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామని వివరించారు. డ్రగ్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్డీపీఎస్ (NDPS) చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మహిళల భద్రతకు పెద్ద పీట..

​మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ‘షీ లీడ్స్’, ‘స్నేహిత’ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ​తనిఖీల్లో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణపై సీపీ సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. ఈ తనిఖీల్లో హుజురాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>