కలం, వెబ్ డెస్క్: ఏపీలో మరో వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ (Operation Clean Sweep) కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలుత కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ (Minister Narayana) ప్రారంభించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మంత్రి రోడ్లు ఊడ్చి డివైడర్‌కు పెయింట్ వేశారు. నాలుగు వారాలపాటు ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. అనంతరం అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మంత్రి.. ప్రజలతో కలిసి క్యాంటీన్ లో అల్పాహారం తీసుకున్నారు.
పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పరిసరాలు బాగుంటేనే తామంతా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్‌లను శుభ్రం చేస్తామని, రెండో వారంలో కాల్వలను క్లీన్ చేస్తామని వివరించారు. మూడో వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను వేరుచేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామమని అన్నారు. ఇక నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచేలా కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.
మార్కాపురం జిల్లా కనిగిరిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో చెత్తను వారసత్వంగా అప్పగించారని, కూటమి ప్రభుత్వంలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్యానించారు.

