కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలు, మహిళలు, రైతులు, వృద్ధుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం మహిళలతో కలిసి ప్రజల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంఆర్ఓకు అందజేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహ భారం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు తెలంగాణలో లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచాయని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా ఈ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తితో కోర్టులో కేసు వేయించి కల్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా, “ఈ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదు?” అని ప్రశ్నించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

