కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రానికే విద్యుత్ వెలుగులు పంచుతూ ‘పవర్ హౌస్’గా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో విద్యుత్ ఉత్పత్తి భారీగా జరుగుతున్నప్పటికీ, స్థానికంగా కరెంటు కోతలు కొనసాగుతుండటంపై ప్రజలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS) (1080 MW), పాల్వంచలోని కేటీపీఎస్ (KTPS) (1800 MW) కలిసి మొత్తం 2,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, స్థానిక ప్రజలకు మాత్రం కరెంటు కష్టాలు తప్పడం లేదు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పగటిపూట, అర్ధరాత్రి వేళల్లో తరచుగా కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, గృహ వినియోగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి మూల స్తంభాలైన పాల్వంచ, మణుగూరు పట్టణాలలోనే ఈ వివక్ష ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘విద్యుత్ ఉత్పత్తి చేసే చోటే కరెంటు లేకపోవడం అన్యాయం’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం సబ్సిడీల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నాణ్యమైన విద్యుత్ అందించడంలోనూ పాలక వర్గం చిత్తశుద్ధి చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు తమ రాజకీయ జెండాలను పక్కన పెట్టి, ప్రజల కోసం సబ్ స్టేషన్‌ల వద్ద గళమెత్తాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

